కులగణనకు సుప్రీంకోర్టు ఓకే !

Telugu Lo Computer
0


జనాభా లెక్కల్ని కులాల వారీగా గణించాలన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కేంద్రానికి కూడా కులగణనపై పలు విజ్ఞప్తులు చేసిన బీహార్ సర్కార్, కేంద్రం స్పందించకపోవడంతో తానే కుల గణన చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేతలకు చుక్కెదురైంది. బీహార్ లో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన ప్రక్రియ వివాదాస్పదమైంది. అంతకు ముందే కేంద్రానికి కులగణన కోసం పలు విజ్ఞప్తులు చేయడమే కాకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేసి పంపారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. దీనిపై బీజేపీ వ్యతిరేకతే ఇందుకు కారణం. దీంతో నితీశ్ కుమార్ సర్కార్ తానే స్వయంగా కులాల వారీగా జనగణన చేయాలని నిర్ణయించింది. బీహార్ క్యాబినెట్ జూన్ 2022లో సర్వేకు ఆమోదం తెలిపింది. దీని మొదటి దశ జనవరి 7న ప్రారంభమైంది. మొత్తం ప్రక్రియ మే 21నాటికి ముగిసే అవకాశం ఉంది. 12 కోట్ల మందికి పైగా ప్రజలను లెక్కించి, 2.5 కోట్లకు పైగా కుటుంబాలను ఇందులో సర్వే చేస్తారు. కేంద్రం చేపట్టే జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీహార్ లో కులాల సర్వే నిర్వహించాలన్న బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్లను సంబంధిత హైకోర్టును ఆశ్రయించేందుకు అనుమతిస్తూ పిటిషన్లలో ఎటువంటి మెరిట్ లేదని సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసింది. అయితే, పాట్నా హైకోర్టు ఇప్పటికే పిటిషనర్ వాదనను విని, అది 'సర్వే' కాదు జనాభా లెక్క అని పేర్కొంటూ దానిని తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీనిపై పిటిషన్లను తిరస్కరించడంతో నితీశ్ సర్కార్ కు ఇది భారీ విజయంగా మారింది. ఇప్పటికే ఏపీ సహా పలు రాష్ట్రాల్లో బీసీ కుల గణన డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ లో నితీశ్ సర్కార్ చేపట్టిన కుల గణనకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఇక మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఈ ప్రక్రియకు తెరలేపే అవకాశముంది. బీజేపీయేతర రాష్ట్రాల్లో కుల గణన ప్రారంభమైతే ఆ ప్రభావం కచ్చితంగా కేంద్రంపైనా పడటం ఖాయం. 2024 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా కుల గణన డిమాండ్లు పెరిగితే అది కేంద్రంలో ఎన్డీయే సర్కార్ విజయావకాశాలపై ప్రభావం పడటం ఖాయమనే అంచనాలున్నాయి. అందుకే బీజేపీ, కేంద్రం కులగణనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)