కెన్యాలో డ్యామ్ కూలి 42 మంది మృతి

Telugu Lo Computer
0


కెన్యాలో ఓ డ్యామ్ కూలడంతో సుమారు 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా అక్కడ ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో దేశంలోని పలు ప్రధాన డ్యామ్ లు, నదులు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని డ్యామ్ లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ లోని కిజాబె డ్యామ్ నీటి ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో కొట్టుకుపోయింది. దీంతో అందులోని నీరంతా ఒక్కసారిగా దిగువ గ్రామాల్లోని పోటెత్తింది. ఒక్కసారిగా డ్యామ్ లోని నీరు పొంగుకు రావడంతో సుమారు 42 మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించారు. ఈ విషయాన్ని నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా తెలిపారు. నీటి ఉద్ధృతికి దిగువ ప్రాంతాల్లోని పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయి.. చాలా ప్రాంతాలు బురదలో చిక్కుకున్నాయి. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 100 మందికిపైగా మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)