వందేభారత్ రైళ్లలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రద్దు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా నడిచే వందేభారత్ రైళ్లలో అందించే వాటర్ బాటిళ్ల పరిమాణాన్ని తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు కేవలం 500 ml నీటిని మాత్రమే అందజేయనున్నారు. వందే భారత్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడే ప్రయాణికులు ఫుడ్‌ కూడా ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. దీని ద్వారా మీరు కూర్చున్న చోటుకే భోజనం సరఫరా అవుతుంది. అయితే భోజనంతో పాటు ప్రయాణీకుడికి ఒక లీటర్ వాటర్ బాటిల్ కూడా రైల్వే శాఖ అందిస్తోంది. ఇప్పుడు లీటర్‌ వాటర్‌ బాటిల్‌ అందించే విధానాన్ని మార్చనున్నారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో ఈ ఒక లీటర్ వాటర్ బాటిల్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేరు. సగం తాగిన తర్వాత మిగిలిన సగం వాటర్‌తో ఉన్న బాటిల్‌ను పడేస్తున్నారు. దీంతో తాగునీరు వృథా అయిపోతుంది. దీనికి రైల్వే అధికారులు పరిష్కారం కనుగొంటూ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ప్రకారం, ఇక నుంచి వందేభారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులందరికీ ఆహారంతో పాటు 500 ml వాటర్ బాటిల్ మాత్రమే అందించనున్నారు. ఈ వాటర్ బాటిల్ అయిపోతే, ప్రయాణికులు అడిగితే మరో 500 ml వాటర్ బాటిల్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. కాగా రెండవ 500 ml వాటర్ బాటిల్ కోసం ప్రయాణికులు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం, అన్ని వాటర్ బాటిళ్లను ప్రయాణికుడికి ఒక లీటర్ వాటర్ బాటిల్‌గా కేటాయిస్తారు. అయితే తొలుత 500 ml వాటర్ బాటిళ్లను అందించిన తర్వాత.. అవి సరిపోతే వారు రెండో వాటర్ బాటిల్ కొనాల్సిన పనిలేదు. కొందరికి 500 ml కంటే ఎక్కువ నీరు అవసరమైతే అడిగి తీసుకోవచ్చని రైల్వే యంత్రాంగం పేర్కొంది. ఈ కొత్త నిర్ణయం ద్వారా రైల్వే శాఖలో నీటి వృథా తగ్గడంతో పాటు ప్రయాణికుల డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ విధంగా నీటి వృథా తగ్గితే రైల్వే పరిపాలనకు కూడా డబ్బు ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే వందే భారత్ రైలు ఎక్కే మరియు దిగే ప్రదేశాన్ని బట్టి ఈ నీటి అవసరం మారుతుంటుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)