జీవిత భాగస్వామిని 'పిశాచి' అనడం క్రూరత్వం కాదు !

Telugu Lo Computer
0


వైవాహిక జీవితంలో విఫలమైన ఓ జంట ఒకరినొకరు భూతం, పిశాచి వంటి పేర్లను వాడుతూ దూషించుకోవడం 'క్రూరత్వం'తో సమానం కాదని పాట్నా హైకోర్టు పేర్కొంది. తన నుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు వెలువరించిన ఓ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె మాజీ భర్త, మామ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సమయంలో హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది. బీహార్‌లోని నవాదాకు చెందిన మహిళకు 1993లో ఝార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేశ్‌గుప్తాతో వివాహమైంది. అయితే.. అదనపు కట్నం కింద కారు డిమాండ్‌ చేస్తూ తనను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె 1994లో తన భర్తతోపాటు మామ సహదేవ్‌ గుప్తాపై స్వస్థలంలో కేసు నమోదు చేశారు. తండ్రీకొడుకుల అభ్యర్థనపై ఈ కేసు నలందకు బదిలీ అయ్యింది. 2008లో కోర్టు ఇద్దరికీ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై వారు అదనపు సెషన్స్ కోర్టుకు వెళ్లగా.. పదేళ్ల తర్వాత అప్పీల్‌ తిరస్కరణకు గురైంది. దీన్ని సవాల్‌ చేస్తూ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా ఆ జంటకు ఝార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. పాట్నా హైకోర్టులో తండ్రీకొడుకులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ.. విడాకులు తీసుకున్న మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 21వ శతాబ్దంలో ఓ మహిళను ఆమె అత్తింటి వారు భూతం, పిశాచి అంటూ దూషించారని, ఇది క్రూరత్వం కిందికే వస్తుందని పేర్కొన్నారు. అయితే ఇలాంటి వాదనను అంగీకరించే పరిస్థితి లేదని జస్టిస్ బిబేక్ చౌధురి ఆధ్వర్యంలోని ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ''వైవాహిక జీవితంలో.. ముఖ్యంగా విఫలమైన వివాహ సంబంధాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు ఉంటాయి. అయితే.. అలాంటి ఆరోపణలన్నీ క్రూరత్వం కిందికి రావు'' అని పేర్కొంది. తనను వేధించారని, క్రూరంగా హింసించారని ఆమె పేర్కొన్నప్పటికీ.. పిటిషనర్లలో ఎవరిపైనా నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే దిగువ కోర్టులు వెలువరించిన తీర్పులను రద్దు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)