రాష్ట్రాల హక్కులను హరించిన కేంద్రం !

Telugu Lo Computer
0


కేంద్రం లోని బీజేపీ పదేళ్ల పాలన రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోయేలా చేసిందని, విద్య, భాష, ఆర్థిక, న్యాయ రంగాల్లో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తూనే ఉంటోందని, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో నియమించిన గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంకుశ ధోరణిని కొనసాగించడం రాష్ట్రాలకు వ్యతిరేకమే కాకుండా భారత రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమేనని స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల తరువాత ఇండియా బ్లాక్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవించగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 21న సేలంలో డిఎంకె యువజన విభాగం రెండవ రాష్ట్రస్థాయి సదస్సు జరగనున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ స్టాలిన్ లేఖ రాశారు. గవర్నర్లు ఎవరైతే అర్హులు కారో వారికి ఉన్నతమైన బాధ్యతలు అప్పగించడంతో దేశం రాజకీయంగా అధోగతి పాలవుతోందని విమర్శించారు. బీజేపీ నేతలు ముఖ్యంగా మతద్వేషాలను రెచ్చగొడుతూ హిందీ, సంస్కృత భాషలను రుద్దుతూ మాతృభాష తమిళాన్ని నాశనం చేస్తున్నారని, తమిళ సావంత్ తిరువల్లూర్‌తోసహా ప్రతివారిని కాషాయం చేస్తున్నారని స్టాలిన్ ఆగ్రహం వెలిబుచ్చారు. బీజేపీ దారుణమైన రాజకీయాలను ప్రజాస్వామ్యయుతంగా ఓడించే బలం ద్రవిడ మున్నేట్ర కజగంకే ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలను అత్యవసరంగా అన్ని రాష్ట్రాలకు చేర్చవలసిన బాధ్యత డిఎంకె యువజన విభాగం రెండో రాష్ట్ర సదస్సుకు ఉందని సూచించారు. తమ ప్రభుత్వం ప్రజలకు కల్పించే సహాయాలను వివరిస్తూ పొంగల్ సందర్భంగా అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులపై ఒక కిలో బియ్యం, కిలో చక్కెర ఇవ్వడంతోపాటు రూ.1000 నగదు బహుమతి అందిస్తున్నట్టు చెప్పారు. కుల మతాలకు అతీతంగా అందరూ సమతావాద పొంగల్‌ను జరుపుకొనేలా చేయడమే డిఎంకె విధానమని చెప్పారు. చేనేత కార్మికుల నుంచి ధోతీలు, చీరెలు కొనుగోలు చేసి వాటిని పొంగల్ సందర్భంగా పేదలకు పంపిణీ చేయడమౌతోందని, ఈ విధంగా ప్రభుత్వం చేనేత కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చేస్తోందని తెలిపారు. స్వంత కొలతూర్ నియోజక వర్గంలో వివిధ మతాలు, భాషల ప్రజలంతా జరుపు కుంటున్న సమతావాద పొంగల్‌లో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని, ఈ సమతా విధానం ద్రవిడ ప్రభుత్వ పాలనా నమూనాకు మూలస్తంభమని పేర్కొన్నారు. ఈ సమతా విధానం దేశం మొత్తం మీద అవసరమని అభిప్రాయపడ్డారు. డిఎంకె యువజన విభాగం కార్యదర్శిగా 30 ఏళ్లు తాను విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ యువజన విభాగం మొదటి రాష్ట్రస్థాయి సదస్సు తిరునల్వేలిలో 2007 లో జరిగిందని, 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండో రాష్ట్ర సదస్సు సేలంలో జరుగుతుండడం ఎన్నికలకు యువతను సమాయత్త పరిచే శిక్షణ వంటిదని అభిప్రాయపడ్డారు. దేశానికి ఒక చారిత్రక సంఘటనగా దీన్ని రూపొందించాలని సూచించారు. స్టాలిన్ కుమారుడు , రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ టార్చ్ ర్యాలీని ఆవిష్కరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)