మాంసాహారం - మంచి - చెడు !

Telugu Lo Computer
0


మన దేశంలో మాంసం వినియోగం ఎక్కువగా ఉంది. ఇది ప్రోటీన్‌కు మంచి వనరు. దీని నుంచి అందే ఐరన్, జింక్, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌, ఇతర పోషకాలు శరీరాన్ని బలోపేతం చేస్తాయి. అందుకే క్రమం తప్పకుండా, కొద్ది మొత్తంలో మాంసాహారం తినాలని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే రోజూ మాంసం తినడం అత్యంత ప్రమాదకరం అని తాజా అధ్యయనం తేల్చింది. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం, న్యుమోనియా వంటి తీవ్రమైన వ్యాధులు రావచ్చని పేర్కొంది. బీఎంసీ మెడిసిన్ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారం వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, చికెన్, టర్కీ వంటి పౌల్ట్రీ మీట్ తినే వ్యక్తులకు అనారోగ్యాల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని అతిగా తింటే, స్టమక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గతంలోని అనేక అధ్యయనాలు, పరిశోధనలు సైతం గుర్తించాయి. అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేయని రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినేవారికి ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, న్యుమోనియా, డైవర్టిక్యులర్ డిసీజ్, కోలన్ పాలిప్స్, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చికెన్ ఎక్కువగా తినేవారికి గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, పొట్టలో పుండ్లు, డ్యూడెనిటిస్, డైవర్టిక్యులార్ డిసీజ్, గాల్ బ్లాడర్ డిసీజ్, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.నివేదికల ప్రకారం, ప్రతిరోజూ 70 గ్రాముల ప్రాసెస్ చేయని రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుంది. అలాగే వీరికి మధుమేహం వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెడ్ మీట్ లేదా ప్రాసెస్డ్ మీట్ వినియోగాన్ని పరిమితం చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం లేదా ఇతర రకాల మాంసాహారాలను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పేర్కొంది. బ్రిటన్‌లోని 4,75,000 మంది మధ్య వయస్కులపై ఈ అధ్యయనం జరిగింది. పరిశోధకులు ప్రజల ఆహారం, మెడికల్ రికార్డులు, ఆసుపత్రిలో చేరడం, మరణాల రేటు వంటి వాటిని విశ్లేషించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఎనిమిది సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యయనంలో.. వారంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు మాంసాహారం తినే వారి ఆరోగ్యం, తక్కువగా మాంసాహారం తినే వారితో పోలిస్తే అధ్వాన్నంగా ఉంటుందని వెల్లడైంది. అందుకే చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఐటెమ్స్ ప్రతిరోజూ కాకుండా, అప్పుడప్పుడూ తినడం మంచిది.

Post a Comment

0Comments

Post a Comment (0)