తమిళనాడు, ఒడిశాలో సంతాప దినాలు !

Telugu Lo Computer
0


భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘోర రైలు ప్రమాదం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మూడు రైళ్లు అత్యంత విధ్వంసకర రీతిలో ఢీకొనడం తో జరిగిన రైలు ప్రమాదం వందలాది మంది ప్రాణాలు బలిగొంది. వందల సంఖ్యలో క్షతగాత్రులు హాహాకారాలు చేస్తూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్ చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్, ఒక గూడ్స్ రైలు బహనాగా స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాయి. కోరమండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి లూప్ లైన్ లో ఆగివున్న గూడ్స్ ను డీ కొట్టింది. దీంతో ఇంజిన్ తో పాటు 12 బోగీలు పక్క ట్రాక్ పై ఒరిగిపోయాయి. ఇదే సమయంలో ఆ ట్రాక్ పై యశ్వంతపూర్ హౌరా ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకు రావడంతో 4 జనరల్ బోగీలు ధ్వంసమయ్యాయి. మొత్తం కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో 24 బోగీలలో సగం బోగీలు ధ్వంసం అయ్యాయి. ఈ దారుణ సంఘటనలో ఇప్పటివరకు 278 మంది చనిపోయినట్టు అధికారికంగా వెల్లడించారు. 900 మందికి పైగా గాయాలపాలైనట్టు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఘోర రైలు ప్రమాదం దృష్ట్యా ఒడిస్సా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను రద్దు చేసి మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం సంతాప దినంగా పాటిస్తున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా తమిళనాడులో కూడా ఒకరోజు సంతాప దినం పాటిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రాల వారీగా మృతుల, క్షతగాత్రుల డేటాను సేకరిస్తున్నారు. కేవలం నిముషాల వ్యవధిలో జరిగిన ఈ రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే అతి పెద్ద, విషాదకర రైల్వే ప్రమాదాల జాబితాలోకి చేరిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)