ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి !

Telugu Lo Computer
0


కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వారం గడవకముందే అధికార పంపిణీపై చర్చ మొదలైంది. ఐదేళ్ల వరకు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అంటూ మంత్రి ఎంబీ పాటిల్ బాంబు పేల్చారు. ఆ కామెంట్లతో పార్టీలో మళ్లీ చర్చ మొదలైంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికారం పంచుకునే సూత్రం ఏమీలేదని పాటిల్ అన్నారు. ఒకవేళ పవర్ షేరింగ్ ఫార్ములా ఉండుంటే పార్టీ హైకమాండ్ ఇప్పటికే చెప్పేదని పాటిల్ స్పష్టం చేశారు. మంత్రి ఎంబీ పాటిల్ కామెంట్లపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. అధికార పంపిణీపై ఎవరేమన్నా తనకు అవసరం లేదని, ఈ అంశంపై తానేమీ మాట్లాడనని చెప్పారు. అధికార పంపిణీ, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ నేతలు ఉన్నారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తాము రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. అధికార పంపిణీపై కాంగ్రెస్ ఎంపీ, డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ మాట్లాడుతూ అది ఇప్పుడు చర్చించే అంశం కాదని అన్నారు. దానిపై ఏఐసీసీ స్థాయిలో చర్చ జరగాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారులో ప్రస్తుతానికి 10 మంది సభ్యులే ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ నేతలను కలిసి మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)