అందరూ బెంగళూరు వచ్చేయండి !

Telugu Lo Computer
0


కర్ణాటకలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ప్రకారం హంగ్‌కు ఎక్కువ అవకాశం ఉండటంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 'ఆపరేషన్ కమలం'లో తమ ఎమ్మెల్యేలు చిక్కకూడదని కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అభ్యర్థులు బెంగళూరు వచ్చేయాలని, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండాలని సూచించింది. రేపు ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో హస్తం పార్టీ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. హంగ్‌ అవకాశం ఉంటుందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించినప్పటికీ.. భాజపా, కాంగ్రెస్ తమకే పూర్తిస్థాయి మెజార్టీ దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే అంచనాలకు తగ్గట్టుగా హంగ్ వచ్చినా.. అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించేందుకు రెండుపార్టీలు వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల తర్వాత కాంగ్రెస్, భాజపా నేతలు తమను సంప్రదించారని జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి ఇదివరకు వ్యాఖ్యానించారు. 'ఇప్పటికే మేం నిర్ణయం తీసుకున్నాం. సరైన సమయంలో దానిని ప్రకటిస్తాం'అని జేడీ(ఎస్‌)కు చెందిన తన్వీర్‌ అహ్మద్ తెలిపారు. ఇప్పుడు కుమారస్వామి కింగ్ మేకర్‌గా మాత్రమే కాదు.. కింగ్‌గా మారబోతున్నారని జోస్యం చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై డీకే శివకుమార్‌ ను ప్రశ్నించగా పరోక్షంగా స్పందించారు. 'పార్టీకోసం ఎంతగానో కష్టపడ్డాను. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు నాకు అప్పగించిన తర్వాత నేను నిద్రపోలేదు. వేరేవారిని నిద్ర పోనివ్వలేదు. పార్టీకి ఏది అవసరమో అది చేశాను. కాంగ్రెస్‌ పార్టీ ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది'అని వ్యాఖ్యానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)