హిందువులపై దాడులను అరికట్టేందుకు జార్జియా స్టేట్ అసెంబ్లీ తీర్మానం !

Telugu Lo Computer
0


అమెరికాలోని జార్జియాలో హిందువులపై దాడులను అరికట్టేందుకు  ఏకంగా అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా అమెరికా ఎదగడం వెనుక హిందువుల పాత్ర ఎంతో కీలకమని, అలాంటి వారిపై దాడులు చేయడం, మతోన్మాదులుగా ముద్రవేయడం, అకారణంగా ధ్వేషించడం సరికాదని పేర్కొంది. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. హిందువులపై ఎవరైనా దాడులకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో హిందూయిజం గొప్పదనం గురించి వివరించిందా స్టేట్ అసెంబ్లీ. హిందూ ధర్మం, హైందవం- ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మతం అని, 100కు పైగా దేశాల్లో నివసించే కోట్లాది మంది హిందు మతాన్ని అనుసరిస్తోన్నారని పేర్కొంది. హిందూమతాన్ని అనుసరించే కోట్లాదిమంది ప్రజలు అన్ని మతాలను సమానంగా ఆదరిస్తారని, పరస్పరం గౌరవించుకుంటారని జార్జియా స్టేట్ అసెంబ్లీ వ్యాఖ్యానించింది. శాంతికి ప్రాధాన్యత ఇస్తారని, విలువలకు కట్టుబడి ఉంటారని, విభిన్న సంప్రదాయాలు, వాటిపై అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటారని పేర్కొంది. అలాంటి హిందూమతాన్ని కించపర్చడం గానీ, ఆ మతాన్ని అనుసరించే వారిపై దాడులు చేయడం గానీ సరికాదని వ్యాఖ్యానించింది. హిందూఫోబియాను అరికట్టినట్లు ప్రకటించింది. తమ వ్యక్తిగత భయాందోళనలతో హిందువుపై దాడులు చేయడం.. ఇకపై చట్టరీత్యా నేరమని, దానికి శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జార్జియా స్టేట్ అసెంబ్లీ స్పష్టం చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఫోర్సిత్ కౌంటీ సభ్యులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్ జోన్స్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జార్జియాలోని అనేక పట్టణాల్లో భారతీయ- అమెరికన్లు మెజారిటీ సంఖ్యలో నివసిస్తోన్నారని, వారికి చట్టపరంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మెడికల్, సైన్స్, ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగం, ఆర్థికం, విద్య, మాన్యుఫ్యాక్చరింగ్, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాల్లో తమ దేశం పురోగమించడానికి ఇక్కడ నివసించే హిందువుల సహకారం ఎంతో ఉందని అన్నారు. యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, లలిత కళలు.. వంటి రంగాలను హిందూ సమాజం సుసంపన్నం చేసిందని కూడా ఈ తీర్మానంలో వారు పొందుపరిచారు. తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలను కూడా హిందూయిజం ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీపావళి పండగ సమయంలో వైట్ హౌస్ లో దీపాలను వెలిగించడాన్ని ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు. ఈ హిందూ సంప్రదాయాలు కోట్లాది మంది జీవితాలను అత్యున్నతంగా తీర్చిదిద్దాయని వ్యాఖ్యానించారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికాలోని అనేక ప్రాంతాల్లో హిందూ-అమెరికన్లపై విద్వేషపూరిత నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)