సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

Telugu Lo Computer
0


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారంనాడు పొడిగించింది. సీబీఐ కేసులో మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ఆయనను సీబీఐ హాజరుపరిచింది. ప్రస్తుతం ఈనెల 22 వరకూ ఈడీ కస్టడీలో సిసోడియా ఉన్నారు. ఇదే మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సోమవారంనాడు ఈడీ విచారణకు హాజరైన సమయంలోనే సిసోడియాకు సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరు పరిచిన సీబీఐ ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కీలక దశలో ఉందని తన వాదన వినిపించింది. సిసోడియా కస్టడీని పొడిగించాలని కోరింది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ మంత్రివర్గం ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలను నిర్మూలించేందుకు, గరిష్టంగా ఆదాయ వనరుల కోసం పాలసీని రూపొందించినట్టు ఢిల్లీ సర్కార్ పేర్కొంది. అయితే 2021-22 ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. సిసిడోయాతో సహా 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలోనే ఎక్సైజ్ పాలసీని ఆప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మరోవైపు, లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కవిత, అరుణ్ పిళ్లైని కలిపి ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని, పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలపై ఈడీ ఆరా తీయనుందని, ఇండో స్పిరిట్ సంస్థలో వాటాలపై ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)