స్పీకర్ పోడియం దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక రూలింగ్ ఇచ్చారు. ఇకపై సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీకర్ పోడియం దగ్గరకు రాకూడదని స్పష్టం చేశారు. అలా వస్తే ఆటోమేటిక్‌గా సస్పెండ్ అవుతారని చెప్పారు. ఈ రూల్‌ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సభ గౌరవాన్ని, హోదాలకు తగ్గించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే రూలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అటు టీడీపీ సభ్యుల తీరు అత్యంత హేయంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీ గొడవ వివాదం ప్రివిలేజ్‌ కమిటీకి చేరనుంది. ప్రివిలేజ్‌ కమిటీకి పంపాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ తమ్మినేని అంగీకరించారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభం అయిన కొద్దిసేపటికే సభలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ సభ్యుల వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. తనపై టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి దాడి చేశారని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. తనపై కక్షకట్టి గత రెండేళ్లుగా పలుసార్లు దాడికి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు ఒకరిపై.. ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.  అసెంబ్లీలో జరిగిన ఘర్షణపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పరం విమర్శలకు దారితీసింది. టీడీపీ సభ్యులు దాడి చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. జీవో నెంబర్ వన్ పై నిరసన తెలుపుతున్న తమపైనే దాడి చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు కీలక ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్ కావాలన్న ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు. ఏకంగా స్పీకర్‌పైనే దాడి చేసే పరిస్థితికి టీడీపీ సభ్యులు దిగజారారని విమర్శించారు. స్పీకర్‌కు రక్షణగా వెళ్లిన ఎమ్మెల్యేలు ఎలీజా, సుధాకర్‌బాబుపైనా దాడికి దిగడం దారుణం అంటూ మంత్రులు మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)