చీతాల సంఖ్య పెంచేందుకు కేంద్రం చర్యలు !

Telugu Lo Computer
0


దేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చేందుకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు భారత్‌కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. చీతాల కోసం భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య గతవారం ఒప్పందం జరిగిందని ఆ అధికారి తెలిపారు. ఏడు మగ, ఐదు ఆడ చీతాలను ఫిబ్రవరి 15న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ''ఈ 12 చీతాలు గత ఆరు నెలలుగా దక్షిణాఫ్రికాలో పత్యేక క్వారంటైన్‌లో ఉన్నాయి. ఈ నెల్లోనే ఇవి భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది'' అని తెలిపారు. అటు దక్షిణాఫ్రికా పర్యావరణ విభాగం కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే 10 ఏళ్లలో భారత్‌కు పదుల సంఖ్యలో చీతాలను అందించేందుకు అవగాహన ఒప్పందం జరిగిందని తెలిపింది. తొలి బ్యాచ్‌లో భాగంగా 12 చీతాలను ఫిబ్రవరిలో పంపించనున్నట్లు పేర్కొంది. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రాజెక్ట్‌ చీతా'ను ప్రారంభించింది. ఇందులో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కునో నేషనల్‌ పార్క్‌ కు తరలించారు. గతేడాది సెప్టెంబరు 17న తన పుట్టినరోజున ప్రధాని మోదీ స్వయంగా వీటిని పార్కులో విడిచిపెట్టారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్న చీతాలు.. తొలి వేటను కూడా చేసినట్లు ఆ మధ్య అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)