దగ్గు మందు తాగి 66 మంది చిన్నారులు మృతి చెందడం ఘోరం !

Telugu Lo Computer
0


ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు.  జనవరిలో పురస్కారాలతో పాటు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లు అందిస్తారు. సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌. ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ గాంబియా ఘటనపై స్పందించారు. భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగా 66 మంది చిన్నారులు మృతి చెందడం దేశానికి ఘోరమైన అవమానాన్ని తెచ్చిపెట్టిందని, దేశ ఔషధ నియంత్రణ సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డారు. కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ప్రశంసలు పొందిన భారత్‌కు ఈ ఘటన అపవాదు తీసుకొచ్చిందని అవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లలో దేశం శాస్త్ర, సాంకేతిక పురోగతిలో ఆరోగ్యంగా దూసుకుపోతున్నప్పటికీ, ఇంకా కొన్ని సవాళ్లు అలానే మిగిలి ఉన్నాయన్నారు. ప్రస్తుత విద్యా విధానం గురించి మాట్లాడుతూ 'సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా నేడు ఐఐటీలు అనుసరించడం లేదు. 2022లో ప్రకటించిన ప్రపంచ గ్లోబల్ ర్యాంకింగ్‌లో టాప్ 250లో ఇప్పటికీ ఒక్క భారతీయ ఉన్నత విద్యా సంస్థ కూడా లేదు. మనము తయారు చేసిన వ్యాక్సిన్‌లు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల సాంకేతికతలపై ఆధారపడి ఉంటున్నాయి లేదా అభివృద్ధి చెందిన దేశాల పరిశోధనల ఆధారంగా ఉంటోందని' ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 70 ఏళ్లుగా భారతీయ సమాజం ఎదుర్కొనే చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనుగొనలేకపోవడం మన పరిశోధన రంగం వైఫల్యమేనని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)