రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పదవికి అజయ్ మాకెన్ రాజీనామా

Telugu Lo Computer
0


రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జిపదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై ఇంతవరకూ పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగానే ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ రాసినట్టు చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల పోటీ చేసేందుకు సిద్ధపడిన అశోక్ గెహ్లాట్ చివరి నిమిషంలో రాజస్థాన్ సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు నిరికారించారు. గెహ్లాట్ స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకునేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ గెహ్లాట్ విధేయులైన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు అందులో పాల్గొనేందుకు నిరాకరించారు. సీఎం పదవి నుంచి గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు. ముఖ్యమంత్రిగా గెహ్లాట్ అయితేనే తాము ఒప్పుకుంటామంటూ తీర్మానం చేసేందుకు ఎమ్మెల్యేలు మహేష్ జోషి, ధర్మేంద్ర రాథోర్, శాంతి ధరివాల్‌ పోటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తదుపరి నేపథ్యంలో గెహ్లాట్ నేరుగా సోనియాగాంధీకి క్షమాపణలు చెప్పుకున్నారు. సదరు ముగ్గురు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అజయ్ మాకెన్ అధిష్ఠానానికి సిఫారసు చేశారు. అయితే, ఇంతవరకూ వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంపై అజయ్ మాకెన్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలంటూ రెండు వారాల క్రితం సచిన్ పైలట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా అజయ్ మాకెన్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజస్థాన్‌లోని వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రానుండటం, డిసెంబర్ 4న ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్‌కు సాధ్యమైనంత త్వరగా కొత్త ఇన్‌చార్జిని నియమించాలని మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో అజయ్ మాకెన్ కోరినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లుగా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుకుగా ఉన్న తనకు రాహుల్ పట్ల పరిపూర్ణ విశ్వాసం, అభిమానం ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలోని ట్రేడ్ యూనియన్లు, ఎన్జీవోలపై తాను పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్టు అజయ్ మాకెన్ ఆ లేఖలో ఖర్గేకు విన్నవించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)