'జలజీవన్ మిషన్' అమలులో ఏపీకి 13వ ర్యాంకు

Telugu Lo Computer
0


ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛభారత్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో 2022లో జలజీవన్ మిషన్ అమలు నివేదికను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు 13వ ర్యాంకు దక్కింది. ఈ పథకం అమలు పనితీరులో 2020-21లో 50 శాతం మార్కులు సాధించిన ఆంధ్రప్రదేశ్ 2022లో దానిని 68 శాతానికి పెంచుకుని మూడు ర్యాంకులు ఎగబాకింది. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల పరిధిలో 374 గ్రామాల్లో 8,827 ఇళ్లు, 849 ప్రభుత్వ సంస్థల నుంచి నమూనాలను సేకరించారు. ఇందులో 14 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీ, 32 శాతం ఓబీసీ, 48 శాతం జనరల్ కేటగిరీ కుటుంబాలు ఉన్నాయి. ఈ నివేదిక కోసం 57 శాతం మంది పురుషులు, 43 శాతం మంది మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ఏపీకి చెందిన పలు నగరాలు సత్తా చాటుకున్నాయి. టాప్-100 ర్యాంకుల్లో ఏపీలోని ఐదు నగరాలకు చోటు దక్కింది. విశాఖ 9వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరింది. విజయవాడ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. రాజమండ్రి 41 నుంచి 91వ ర్యాంకుకు పడిపోయింది. కడప ర్యాంకు 51 నుంచి 93కి చేరింది. కర్నూలు ర్యాంకు మాత్రం 70 నుంచి 55కి ఎగబాకింది. నెల్లూరు 60వ స్థానాన్ని దక్కించుకుంది. కాగా పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో తిరుపతి మొదటి స్థానానికి చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)