చివరి రోజు పతకాల పంట !

Telugu Lo Computer
0


కామన్‌వెల్త్‌ గేమ్స్‌ చివరి రోజు భారత్ పతకాల పంట పండింది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో లక్ష్యసేన్​, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా, పురుషుల డబుల్స్‌ విభాగంలోనూ మరో స్వర్ణం అందుకుంది. సాత్విక్‌ – చిరాగ్‌ శెట్టి జోడీ సీన్‌-బెన్‌ ద్వయంపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. మరోవైపు టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం సాధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ మీద 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో శరత్‌ విజయం సాధించాడు. పీవీ సింధు, లక్ష్య సేన్‌, సాత్విక్‌ – చిరాగ్‌, శరత్ కమల్ పసిడి పతకాలు సాధించారు. శరత్‌ తెచ్చిన పతకంతో ఈ రోజు స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. హాకీ పురుషుల విభాగంలో ఫైనల్స్‌ చేరిన భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల టేబుల్‌ టెన్నిస్‌లోనే భారత ఆటగాడు సత్యన్‌ జ్ఞానశేఖర కాంస్య పతక పోరులో పతకం గెలుపొందాడు. ఇంగ్లాండ్‌ ఆటగాడు పాల్‌ డ్రింక్‌హాల్‌ను 11-9, 11-3, 11-5, 8-11, 9-11, 10-12, 11-9 తేడాతో ఓడించి 4-3తో విజయం సాధించాడు. భారత్‌ పతకాల సంఖ్య 61కి చేరగా, ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇవాళ ఒక్కరోజే నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒ కాంస్యాన్ని సాధించింది. హాకీ పురుషుల విభాగంలో ఫైనల్స్‌ చేరిన భారత జట్టు పూర్తిగా నిరాశపర్చింది. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో నాలుగు క్వార్టర్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన ఆసీస్‌ జట్టు భారత్‌ను 8-0తో చిత్తుగా ఓడించింది. దీంతో ఆ జట్టు బంగారు పతకం కైవసం చేసుకోగా భారత్‌ రజతంతో సరిపెట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)