ఆగస్టు 1 నుంచి రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ పేమెంట్స్

Telugu Lo Computer
0


ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ పేమెంట్స్ నిర్వహించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. రైల్వే సౌకర్యాలకు సంబంధించి నగదు రహిత లావాదేవీలు జరిపేలా భారత రైల్వే శాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి రైల్వేస్టేషన్లలో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో క్యాష్‌కు బదులుగా డిజిటల్ పద్ధతిలో పేమెంట్స్ చేసుకోవచ్చు. నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది. ఈ మేరకు యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్‌సేల్ మెషిన్‌లు, స్వైపింగ్ మెషీన్‌లను ఉంచుకోవడం తప్పనిసరిగా ఆదేశాల్లో పేర్కొంది. ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాల్సిందిగా సూచించింది. రైల్వే బోర్డు తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంపై ఏ వస్తువునైనా ఎంఆర్పి  ధరకే స్టాల్ నిర్వాహకులు విక్రయించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లలో అధిక ధరలకు వస్తువులను అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ కొత్త విధానాన్ని రైల్వే శాఖ అమల్లోకి తీసుకొస్తోంది. తద్వారా ఇలాంటి అక్రమాలను అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి అమ్ముతున్న పరిస్థితి ఉంది. క్యాష్ లెస్ చెల్లింపులతో అధిక ధరకు విక్రయించడం కుదరదు. క్యాటరింగ్ క్యాష్‌లెస్ చెల్లింపులపై గతంలోనే రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలు, ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది. స్టాల్స్‌తో పాటు ట్రాలీలు, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్లలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని రైల్వే బోర్డు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)