ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో కెప్టెన్ అమరీందర్ ?

Telugu Lo Computer
0


ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్‌ దాఖలుకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి తన అభ్యర్థి ఎవరన్న దానిపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ రేసులో పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరు తాజాగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌తో విభేదించి ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించే దిశగా బీజేపీ సాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త అమరీందర్ సింగ్ కార్యాలయం నుంచే రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయ సిబ్బంది శనివారం వెల్లడించారు. ప్రస్తుతం అమరీందర్‌ సింగ్‌ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్‌లో ఉన్నారు. గత ఆదివారం ఆపరేషన్‌ పూర్తయిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు సమాచారం. లండన్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత కెప్టెన్‌ తన ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ)’ పార్టీని భాజపాలో విలీనం చేయనన్నట్లు శుక్రవారం పలు మీడియా ఛానళ్లలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే మోదీతో అమరీందర్‌ మంతనాలు జరిపినట్లు సమాచారం. విలీనం అనంతరం కెప్టెన్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన ఆయన పంజాబ్‌కు సీఎంగా సేవలందించారు. అనూహ్యంగా 8 నెలల కిందట కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. నాటి పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌తో భేదాభిప్రాయాలు రావడంతో కాంగ్రెస్ ఆయణ్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. ఈ పరిణామంతో మనస్తాపానికి గురై కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు అమరీందర్ సింగ్. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 'పంజాబ్ లోక్ కాంగ్రెస్' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోవడమే కాకుండా.. పాటియాలా స్థానం నుంచి స్వయంగా ఆయన కూడా ఘోర పరాజయం చవిచూశారు. ఈ నేపథ్యంలో తన కొత్త పార్టీని బీజేపీలో విలీనం చేస్తే… అమరీందర్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ప్రధాని సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయంపై అమరీందర్‌, మోదీలు ఇప్పటికే చర్చించారని, కెప్టెన్ దేశానికి తిరిగి వచ్చిన వెంటనే బీజేపీతో ఆయన పార్టీ విలీనం జరిగిపోతుందని, ఆ వెంటనే ఆయనను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 6న ఎన్నిక నిర్వహించనున్నారు. జులై 5 నుంచి జులై 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. పోలింగ్‌ తేదీ రోజునే ఫలితాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)