బీజేపీతో జనసేన కటీ ఫ్ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రధాన విపక్షాలు ఏకమవుతాయనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతుండగా తాజాగా జరుగుతున్న పరిణమాలు మాత్రం భిన్నంగా కన్పిస్తున్నాయి. పొత్తులు సరే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపైనే పీఠముడి నెలకొంది. పొత్తులు ఉంటే జనసేన చీఫ్ పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని, అలా ప్రకటన చేస్తేనే పొత్తులు ఉంటాయని జనసేన నేతలు చేస్తున్న కామెంట్లు హాట్ హాట్ మారాయి. జనసేన నేతల ప్రకటనలపై బీజేపీ , టీడీపీ నేతల తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో ఏపీలో అసలు పొత్తులు ఉంటాయా? ఉంటే ఎవరి మధ్య ఉంటాయి? ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో క్లారిటీ వస్తుందా అన్నది ప్రశ్నగా మారింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ పర్యటనలో ఉండటంతో ఆయనే పొత్తులపై క్లారిటీ ఇస్తారని అంటున్నారు. దీంతో రాజమండ్రి సభలో జేపీ నడ్డా ఏం చెబుతున్నారన్నది ఆసక్తిగా మారింది. పొత్తులపై మొదటగా మాట్లాడింది జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ పొత్తుల సంకేతం ఇచ్చారు. తర్వాత టీడీపీ నేతలు కూడా పొత్తులకు సిద్దమనే సిగ్నల్ ఇచ్చారు. త్యాగాల సిద్ధమంటూ చంద్రబాబు ఒ అడుగు ముందుకు వేశారు. టీడీపీ, జనసేన నేతల మాటలతో ఏపీలో పొత్తులు ఖాయమనే చర్చ సాగింది. 2014 తరహాలోనే బీజేపీ,జనసేన,టీడీపీ కలిసి పోటీ చేస్తాయని.. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ హైకమాండ్ తో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందని చెబుతూనే.. టీడీపీ విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ఉంటారని కూడా కొందరు కమలం నేతలు ప్రకటనలు చేశారు. దీంతో జనసైనికులంతా పవనే కాబోయే సీఎం అంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. అయితే పవనే తమ సీఎం అభ్యర్థి అని గతంలో ప్రకటనలు చేసిన బీజేపీ నేతల వాయిస్ లో ఇప్పుడు మార్పు వచ్చింది. జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తుడంగానే పొత్తులపై ఏపీ కమలం నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై దాటవేసే దోరణిలో వ్యవహరిస్తున్నారు బీజేపీ నేతలు. పొత్తులు, సీఎం అభ్యర్ధిపై ఇప్పుడే ప్రస్తావన అనవసరమని బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ అన్నారు. ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని తమ పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు, అంతేకాదు బీజేపీ కాకుండా ఇతర పార్టీ అభ్యర్ధులను ముఖ్యమంత్రిగా ప్రకటించే సంప్రదాయం బీజేపీలో ఎప్పుడు లేదన్నారు సత్యకుమార్. దీంతో పవన్ ను సీఎంగా ప్రకటించబోమని ఆయన చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. అంతేకాదు వైసీపీ నేతల ట్రాప్ లో పడొద్దని జనసేకు సూచించారు సత్యకుమార్. విజయవాడలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో చర్చించారు జేపీ నడ్డా. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, పొత్తుల అంశంపైనే ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. జేపీ నడ్డాతో సమావేశం తర్వాతే సత్యకుమార్ సీఎం అభ్యర్థిపై చర్చ ఇప్పుడే వద్దని కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీగానే ఉన్న ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ను ప్రకటించడానికి మాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. జనసైనికులు చెబుతున్నట్లు పవన్ పై జేపీ నడ్డా ఎలాంటి ప్రకటన చేయబోరని తెలుస్తోంది. మరోవైపు జనసేన నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందని తేల్చిచెబుతున్నారు. లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అటు టీడీపీ నేతలు కూడా పవన్ ను సీఎంగా ప్రకటించే అవకాశం లేదంటున్నారు. జనసేనాధిపతి అతిగా ఊహించుకుంటున్నారంటూ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. గోరంట్ల ట్వీట్ తో పవన్ విషయంలో టీడీపీ కూడా క్లారిటీగానే ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది చూడాల్సిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)