ప్రశాంత్‌ కిషోర్‌ చేరికపై రెండు షరతులు ?

Telugu Lo Computer
0


కాంగ్రెస్‌ పార్టీలో చేరాలంటే రెండు షరతులకు ఒప్పుకోవాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌కు కండీషన్స్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఐప్యాక్‌ను మూసేయడం, రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో సంబంధాలు తెంచుకోవడం. ఈ రెండూ చేస్తానంటేనే పార్టీలోకి ఆహ్వానించాలని కొందరు సీనియర్లకు అధిష్టానానికి సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్ సేవలను పలు పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమత గెలుపు కోసం పనిచేశారు. ఇప్పటికీ ఆ ఒప్పందం కొనసాగుతోంది. ఇక ఏపీలో జగన్‌ కోసం, తమిళనాడులో స్టాలిన్‌ కోసం పీకే టీమ్‌ పనిచేసింది. వీరితో డీల్స్ ఇంకా లైవ్‌లోనే ఉన్నాయి. తాజాగా టీఆర్‌ఎస్‌ కోసం పీకే పనిచేస్తారంటూ ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో చేరాలనుకుంటే మాత్రం టీఆర్‌ఎస్‌, వైసీపీ, డీఎంకే, తృణమూల్‌తో ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రశాంత్‌ కిషోర్ ప్రజంటేషన్‌ బాగుందంటూ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు సీనియర్లు. పార్టీలోకి పీకే చేరికను రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు సమర్ధించారు. ఇక పీకే ఇచ్చిన బ్లూప్రింట్‌లో దక్షిణాదిపైనే ఎక్కువ ఫోకస్ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు మొన్నటి వరకు బలం ఉన్న ఈస్ట్‌ ఇండియా రాష్ట్రాలపైనా పీకే ఓ ప్రజంటేషన్ ఇచ్చారు. తూర్పు, దక్షిణ భారత రాష్ట్రాల నుంచి లోక్‌సభకు 200 మంది ఎంపీలు వస్తుండడం, ఇక్కడ బీజేపీ ప్రభావం లేకపోవడంతో.. ఈ రెండు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని పీకే సూచించారు. కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ పూర్వవైభవం తెప్పించడానికి 600 మార్గాలు సూచించారు. అయితే ఈ వివరాలు సోనియాతో పాటు కమిటీ సభ్యులకు మాత్రమే తెలుసని ఏఐసీసీ తెలిపింది. మరోవైపు పీకే ప్రజంటేషన్, బ్లూప్రింట్‌పై అధ్యయనం చేస్తున్న త్రిసభ్య కమిటీ.. రెండు మూడు రోజుల్లోనే నివేదికను సమర్పించనుంది. ఇప్పటికైతే పీకే చేరికపై ఓ స్పష్టత వచ్చినట్టేనని, ఒకట్రెండు అంశాలు తప్ప అంతా సవ్యంగానే సాగుతోందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆసక్తిగా ఉండడంతో.. ఏ ఒక్క పార్టీకో కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా లేరని పీకే వర్గాలు అంటున్నాయి. అయినప్పటికీ, పీకే చేరికపై ఇవేమీ ప్రతిబంధకాలు కాబోవని.. కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు మార్గం సుగమం అయినట్టేనని చెబుతున్నారు. పార్టీలో చేరిన తరువాత ప్రశాంత్‌ కిషోర్‌ పాత్ర ఎలా ఉండాలన్నది రాహుల్‌ను సంప్రదించి సోనియా తుది నిర్ణయం తీసుకుంటారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)