కరెంట్ కోతలపై కొత్త నిబంధనలు

Telugu Lo Computer
0


దేశంలో కరెంట్ కోతలపై కేంద్ర విద్యుత్ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు లక్ష, అంతకు మించి జనాభా ఉండే పట్టణాల్లో డిస్కంలు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిబంధనను తక్షణమే అమల్లోకి తెచ్చేలా ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో లక్షకు పైగా జనాభా ఉండే పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. కాలుష్యాన్ని నివారించాలంటే పట్టణాల్లో నిరంతర కరెంట్ సరఫరా జరిగేలా డిస్కంలు చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ అభిప్రాయపడింది. ఈ పట్టణాల్లో ఏవైనా కారణాలతో కరెంట్ నిలిపివేసినా మూడు నిమిషాల్లో పునరుద్ధరించాలని.. అప్పుడే నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పరిగణించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అటు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా డీజిల్ జనరేటర్ల బదులు సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధనాన్ని బ్యాటరీ బ్యాకప్ సహాయంతో వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. వచ్చే ఐదేళ్లలో పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల బదులు అందరూ సంప్రదాయేతర ఇంధన వినియోగంలోకి మారేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)