ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 118 కిలోల నకిలీ విత్తనాలు పట్టివేత !

Telugu Lo Computer
0


ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలలో నకిలీ విత్తనాలు బెడదతో అన్నదాత విలవిల్లాడుతున్నాడు. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల తనిఖీలలో కొన్నే బయటపడుతున్నాయి. రైతులకు చేరాల్సినవి చేరిపోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడిజిల్లాలో కొన్నిప్రాంతాలపై నకిలీ విత్తనాలు దాడి చేస్తున్నాయి. మారుమూల గ్రామాలను అక్కడి రైతులను మంచి చేసుకుని నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ఒక్కరోజు తనిఖీలు చేపడితే ఒక క్వింటాల్ 18 కిలోల నకిలీవిత్తనాలు దొరికాయంటే ఏమేరకు నకిలీ రాయుళ్ళు వేళ్లూనుకుపోతున్నారో అర్థం అవుతుంది. మంచిర్యాలజిల్లా తాండూరు .భీమిని ,నెన్నెల, కన్నెపల్లి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున విత్తనాలు నిల్వచేశారు. తాండూర్ మండలంలో ఓవ్యాపారి ఏటా కోట్ల వ్యాపారం చేస్తున్నారనే విషయం ప్రచారంలో వుంది. గతంలో రెండుమూడుసార్లు పట్టుబడ్డా ఇప్పటికీ ఆ వ్యాపారం వదల్లేదు. తాండూరు ,రెబ్బన,తిర్యాణి మండలాలకు సైతం ఇక్కడినుంచే విత్తనాల సరఫరా జరుగుతుంది. వీరికి కొందరు పోలీసులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేసి నకిలీ విత్తనాలు అరికట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ మూడుమండలాల్లో 118 కిలోల నకిలీ పత్తివిత్తనాలు సీజ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)