జైళ్లలో వైద్యసదుపాయాలు మెరుగుపర్చాలి

Telugu Lo Computer
0



జైళ్లలో వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని ఆ శాఖకు బోంబే హైకోర్టు సూచించింది. జైళ్లలో ఉంటున్న ఖైదీలు తమకు తగిన వైద్య సదుపాయాలు లేవని చెబుతూ, తమకు బెయిలు మంజూరు చేయాలని కోరడానికి అవకాశం లేకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని తెలియజేసింది. దీనివల్ల భీమా కొరెగావ్ కేసులో నిందితుడు వరవరరావు, మరికొందరు ఖైదీల ఫిర్యాదులు పరిష్కారమవుతాయని పేర్కొంది. అలాంటప్పుడు భవిష్యత్తులో ఈ కారణాన్ని చూపుతూ బెయిలును కోరడానికి అవకాశం ఉండదని తెలిపింది. వరవరరావుకు శాశ్వత బెయిలును మంజూరు చేయడానికి బొంబే హైకోర్టు తిరస్కరించింది. అయితే కంటిలోని శుక్లానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఆయనకు బెయిలు గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది. మానవతా కారణాలతో ఈ ఉపశమనం కల్పించింది. జైళ్లలో వైద్య సదుపాయాల గురించి శ్రధ్ధగా చూడక పోతే, లోపాలను సరిద్దిడంపై తగిన ఆదేశాలను జారీ చేయకపోతే విచారణ ఖైదీలంతా దీనినే సమస్యగా చూపించి బెయిలు కోసం దరఖాస్తు చేస్తారని పేర్కొంది. బెయిలును మంజూరు చేయడం ద్వారా మరొక దృష్టాంతాన్ని సృష్టించడానికి బదులుగా, భవిష్యత్తులో లోపాలకు జవాబుదారీ తనాన్ని నిర్ణయించడానికి తగిన నిర్దేశాలను జారీ చేయడం సముచితమవుతుందని అభిప్రాయపడింది. జస్టిస్ సునీల్ షుక్రే, జస్టిస్ జీఏ సనప్ ధర్మాసనం ఈ నిర్దేశాలను జారీ చేసింది. ఇకపై వైద్య సదుపాయాలు లేవని, సకాలంలో వైద్య సహాయం అందలేదని ఖైదీలు చెప్పడానికి అవకాశం ఉండకూడదని మహారాష్ట్ర జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు తెలిపింది. వరవరరావుకు 2021 ఫిబ్రవరిలో ఆరు నెలల తాత్కాలిక బెయిలు మంజూరైంది. దీన్ని పొడిగించాలని ఆయన కోరారు. తలోజా జైలులో తాను జీవించే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)