నోట్ల గుట్టలే గుట్టలు!

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ పర్ఫ్యూమ్‌ తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. ఇంట్లో సోదాలు జరుపుతూ అనుమానస్పదంగా కన్పించిన రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నీట్‌గా ప్యాక్‌ చేసిన కరెన్సీ నోట్ల కట్టలు కన్పించాయి. దీంతో అధికారులు వెంటనే బ్యాంక్‌ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించారు. నిన్న సాయంత్రం నుంచి ఈ లెక్కింపు కొనసాగగా.. శుక్రవారం ఉదయం నాటికి రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న జీఎస్‌టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సొమ్మును నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. ఊహాజనిత కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్‌టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. పీయూష్‌ ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని ఆయన కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఓ వేర్‌హౌస్‌లో 200 నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్న నాలుగు ట్రక్కులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పీయూష్‌ జైన్‌ వ్యాపారి మాత్రమే గాక, సమాజ్‌వాదీ పార్టీ నేత కూడా. ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ పేరుతో పీయూష్‌ ఓ ప్రత్యేక పర్ఫ్యూమ్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఎస్పీపై భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. నోట్ల కట్టలను అధికారులు లెక్కిస్తున్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. 'ఎస్పీ అవినీతి వాసన' ఇది అంటూ దుయ్యబట్టింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)