గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్

Telugu Lo Computer
0



గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. ఆదివారం  బీజేపీ శాసనసభా పక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో భూపేంద్ర పటేల్‌ను బీజేపీ శాసనసభా పక్షం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని భూపేంద్ర పటేల్ కోరనున్నారు. ఘట్లోడియా నియోజకవర్గం నుంచి భూపేంద్ర ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులుగా హాజరైన తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో సీఎం ఎంపిక జరిగింది. వచ్చే ఏడాదిలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయ రూపానీ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2016 సంవత్సరం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో సీఎం మార్పులు చేస్తోందనే వార్తలు వచ్చాయి. గుజరాత్ సీఎం పీఠాన్ని పటేల్ సామాజిక వర్గానికి కట్టబెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా భూపేంద్ర పటేల్ పేరు తెరపైకి వచ్చింది. అందులోనూ గుజరాత్ మాజీ సీఎం, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు భూపేంద్ర పటేల్ సన్నిహితుడిగా పేరుంది. విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎవరు అనేది చర్చకు దారితీసింది. రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసిన రుపానీ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఒకవైపు.. అనారోగ్య కారణాలతోనే విజయ్‌ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, మరోవైపు ఆయన రాజీనామాకు అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధి కొనసాగుతుందని రూపానీ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ సమాన అవకాశాన్ని కల్పించే బీజేపీ సంప్రదాయం ప్రకారం తాను రాజీనామా చేసినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)