సోషల్‌ మీడియాలో వేధింపులపై ప్రజాస్వామిక సంస్థల నిరసన !

Telugu Lo Computer
0


ప్రగతిశీల మహిళా మేధావులు, రచయిత్రులు, పాత్రికేయులు, యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకొని మతోన్మాద శక్తులు ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రణాళిక ప్రకారం నీచమైన దాడులు చేస్తున్నాయని వివిధ ప్రజాస్వామిక సంస్థలు, వేదికలు ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల బాధ్యులతో పాటు కవులు, రచయితలు, న్యాయవాద నిపుణులూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. భిన్నమైన ఆలోచనలు కలిగినవారి నోళ్లు మూయించేలా.. ప్రధానంగా మహిళలపై అశ్లీల, అసభ్యకర భాషతో ట్రోల్‌ చేస్తూ అమానుష చర్యలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. 'వీరి దృష్టిలో మహిళలు వంటింటి కుందేళ్లుగానే జీవించాలి. దేశంలో మత, రాజకీయ పరిణామాల గురించి ఆలోచించడం, తమ భావాలను వ్యక్తపరచడం ఈ అప్రజాస్వామిక, సంప్రదాయవాద సమర్ధక ముఠాలకు నచ్చదు. స్త్రీలు తమ ఇష్టాలకు అనుగుణంగా కట్టు, బొట్టు, వేషధారణలు చేసినప్పుడల్లా ఈ అరాచకులు రంగంలోకి దిగి, వ్యక్తిగతంగా ఫోన్‌ కాల్స్‌ చేసి, తలుచుకుంటే వారి ఇళ్లపై దాడులు చేయగలమనీ, ప్రాణ హాని తలపెట్టగలమనీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చర్చలకు, భిన్నాభిప్రాయాలకూ తావు లేకుండా చేసి, విద్వేష భావాలను ప్రచారం చేయడమే వీరి ఆశయం. ఈ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక ధోరణులను మేం నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) ఈ దేశ పౌరులందరికీ వాక్‌ స్వాతంత్య్రాన్ని ఇచ్చింది. ఫలానా విధంగా అభిప్రాయాలు వ్యక్తపరచకూడదనీ, ఫలానా విధంగానే బతకాలని శాసించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ ప్రాథమిక హక్కును ప్రభుత్వంతో పాటు ఎవరూ హరించడానికి వీలు లేదు' అని ప్రకటనలో వివరించారు. ఈవిధంగా బెదిరింపులు, దాడులకు పాల్పడే శక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, వీరి దూకుడును కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థనూ కోరారు.ఈ ప్రకటనపై కవులు, రచయితలు ఉణుదుర్తి సుధాకర్, డా. సి.మృణాళిని, కొండేపూడి నిర్మల, గోగు శ్యామల, విమల, పి .సత్యవతి, నల్లూరి రుక్మిణి, ఓల్గా, అక్కినేని కుటుంబరావు, అఫ్సర్, నారాయణస్వామి, ప్రసాదమూర్తి తదితరులు, ప్రొ.జి.లక్ష్మణ్‌ (పౌరహక్కుల సంఘం, తెలంగాణ), ఎస్‌.జీవన్‌ కుమార్‌ (మానవ హక్కుల వేదిక), అరసవిల్లి కృష్ణ, రివేరా (విప్లవ రచయితలసంఘం), శ్రీదేవి (చైతన్య మహిళా సంఘం), విజయ భండారు (హైదరాబాద్‌ విమెన్‌ రైటర్స్‌ ఫోరమ్‌), పసునూరి రవీందర్, కన్వీనర్‌ (సముహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరమ్‌), కొండవీటి సత్యవతి (భూమిక) తదితరులు సంతకాలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)