మాస్కో మారణహోమంలో 115కి చేరిన మృతుల సంఖ్య !

Telugu Lo Computer
0


రష్యా లోని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి చొరబడిన సాయుధ ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 115కు చేరుకుందని, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో 'కార్ ఛేజ్' చేసి వారిని పట్టుకున్నట్లు సమాచారం. రష్యా భద్రత సంస్థ శనివారం దేశాధినేత పుతిన్‌కు దీనిపై సమాచారం అందించినట్లు ప్రభుత్వ వార్తాసంస్థ 'టాస్‌' పేర్కొంది. మాస్కోలోని క్రాస్నోగోర్స్క్‌లో ఉన్న క్రాకస్‌ సిటీ హాల్‌లో షాపింగ్ మాల్, సంగీత కచేరీ వేదిక ఉన్నాయి. రష్యన్ రాక్ బ్యాండ్ 'పిక్నిక్' ప్రదర్శనకు శుక్రవారం పెద్దఎత్తున అభిమానులు వెల్లువెత్తారు. ఈ క్రమంలోనే ముష్కరులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబులూ విసిరారు. తూటాల నుంచి తప్పించుకునేందుకుగానూ చాలామంది సీట్ల వెనక దాక్కోగా.. మరికొందరు ప్రవేశద్వారాల వైపు పరుగులు తీశారు. సాయుధులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపినట్లు కనిపిస్తోన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ దాడుల్లో మంటలు చెలరేగి.. కొద్దిసేపటికి హాల్‌ పైకప్పు కూడా కూలిపోవడం గమనార్హం. హెలికాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ముష్కరులకు ఉక్రెయిన్‌తో పరిచయాలు ఉన్నాయని, దాడుల అనంతరం ఆ దేశం వైపు వెళ్లేందుకు యత్నించారని ఎఫ్‌ఎస్‌బీ ఆరోపించింది. అయితే.. తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్‌ ఖండించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ఘటనపై అగ్రరాజ్యం గతంలోనే మాస్కోను హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకునేందుకు రక్తం, ప్లాస్మా దానానికి వందల మంది ప్రజలు బారులు తీరారని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)