తిరుమలలో కన్నుల పండువగా రథసప్తమి !

Telugu Lo Computer
0


తిరుమలలో రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. 12 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులురథ సప్తమి నాడు మినీ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ఒకే రోజున శ్రీవారు.. సప్త వాహనాలపై దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ విశేష సేవలను నిర్వహించారు. తెల్లవారు జామున 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథ సప్తమి వేడుకలు ఆరంభం అయ్యాయి. 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై దర్శనం ఇచ్చారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవలను నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నాన కార్యక్రమాన్ని చేపట్టారు టీటీడీ అర్చకులు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చారు. మలయప్ప స్వామివారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగడంతో రథసప్తమి వేడుకలు ముగిశాయి. ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వారికోసం గ్యాలరీల్లో ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లను నిర్మించారు టీటీడీ అధికారులు. శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 850 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది మోహరింపజేశారు. 700 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు. 2,900 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలను అందించారు. అత్యవసర పరిస్థితుల కోసం 25 మంది డాక్టర్లు, 50 మంది పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. సుమారు 10 వేల మందికి వారు వైద్యసహాయాన్ని అందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)