డ్రైవర్లపై వివాదాస్పాద వ్యాఖ్యలు చేసిన కలెక్టర్‌ బదిలీ !

Telugu Lo Computer
0


హిట్‌ అండ్ రన్‌ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఆదేశించారు. షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యల్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని ఆదేశించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి భాషను సహించబోమని ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. కన్యల్‌ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. బదిలీ తర్వాత, నార్సింగ్‌పూర్ కలెక్టర్ రిజు బఫ్నా షాజాపూర్ కొత్త కలెక్టర్‌గా నియమితులయ్యారు. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం ఓ డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్‌ జిల్లా కలెక్టర్‌ కిషోర్ కన్యల్‌ సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని వారిని  హెచ్చరించారు. అంతలోనే తమతో సరిగ్గా మాట్లాడాలంటూ ఓ ప్రతినిధి కోరగా ఆగ్రహానికి గురైన కలెక్టర్‌ “నువ్వేం చేయగలవు? నీ స్థాయి ఎంత” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. లారీ డ్రైవర్లపై కలెక్టర్ అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో కిషోర్ కన్యల్ క్షమాపణలు చెబుతూ వేదికపైకి వచ్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యాదవ్ స్పందిస్తూ.. 'ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం' అని అన్నారు. “ఎంత పెద్ద అధికారి అయినా పేదల పనిని, భావాలను గౌరవించాలి. మనిషిగా మా ప్రభుత్వం ఈ రకమైన భాషను సహించదు. నేను కూడా ఓ కూలీ కొడుకునని” అని సీఎం మోహన్‌ యాదవ్ చెప్పారు. “ఇలాంటి అధికారులకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అర్హత లేదు' అని సీఎం మోహన్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)