బీజేపీతో పాటు కాంగ్రెస్‌ మా పథకాలు కాపీ కొట్టారు !

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్రంలోని బీజేపీతో పాటు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎజెండాను, పథకాలను ఆ రెండూ కాపీ కొట్టాయని ఆరోపించారు. ఇంతకుముందు కేజ్రీవాల్‌కి గ్యారెంటీ అని తాము చెప్పేవాళ్లమని.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు గ్యారెంటీలంటూ డప్పు కొడుతున్నాయని ఎద్దేవా చేశారు. మేనేఫెస్టో, తీర్మాన పత్రాలు వంటి పదాలు పూర్తిగా మాయమయ్యాయని అన్నారు. తాము ప్రకటించిన పథకాల్లో ఉచిత విద్య, ఉచిత విద్యుత్ ఉన్నాయని.. అయితే.. ప్రతిపక్షాలు కేవలం ఉచిత విద్యుత్ హామీనే అమలు చేస్తున్నాయని అన్నారు. ఉచిత విద్య గురించి కేవలం మాట్లాడుతున్నారే గానీ, ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వట్లేదని మండిపడ్డారు. కేవలం తామ పార్టీ మాత్రమే ఉచిత విద్య హామీ ఇవ్వగలదని నొక్కి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ''మీ పిల్లలకు పాఠశాలలు నిర్మిస్తామని లేదా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తామని ఆ రెండు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్) చెప్పలేదు. గత 75 ఏళ్లుగా ఈ దేశ ప్రజలను ఉద్దేశపూర్వకంగానే చదువుకోకుండా ఉంచుతున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గత 7 ఏళ్లలో 2 కోట్ల మందికి మంచి విద్యను అందించగలిగితే.. గత 75 ఏళ్లలో 140 కోట్ల మందికి మంచి విద్యను అందించలేకపోయారా?'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అంబేద్కర్ మరో 15 ఏళ్లపాటు జీవించి ఉంటే.. దేశంలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతో మెరుగుపరిచేవారని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు తమ పథకాల్ని కాపీ కొట్టి అమలు చేస్తున్నాయి కానీ.. ఉచిత విద్య గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. తాము అంబేద్కర్ శిష్యులం కాబట్టి విద్య గురించి మాట్లాడగలుగుతున్నాయని.. తమ ఆప్ విద్యారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని అన్నారు. ఆప్‌ నుంచి అధికారాన్ని లాక్కోవడం కోసం ఎన్నో అడ్డంకులు సృష్టించారంటూ బీజేపీపై పరోక్షంగా ధ్వజమెత్తారు. కానీ.. వాళ్లకు అది సాధ్యపడలేదన్నారు. పోరాటం, సేవ అనేవి అంబేద్కర్ సూత్రాలని.. అవి రెండూ మనకు వర్తిస్తాయని కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కోసమే పుట్టిందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే ఆప్‌ ఉందని, దేశాభివృద్ధి కోసం చేసే పోరాటంలో తమ విధానాలను వదులుకోలేమని స్పష్టం చేశారు. ఢిల్లీలోని 2.5 కోట్ల మంది ప్రజలు ఆమ్ ఆద్మీలో సభ్యులుగా ఉండే రోజు తప్పకుడా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆప్‌లో సభ్యులుగా ఉండే రోజు వస్తుందని.. ఒకవేళ దేశాన్ని, ఆప్‌ని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీని తన్ని దేశాన్ని ఎన్నుకోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)