బస్సు డ్రైవర్‌ను బెదిరించి రూ. 14 లక్షలు కాజేసిన పోలీసులు !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుల్స్ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ నుంచి రూ.14 లక్షలు దోచుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అరెస్ట్‌ చేశారు. అలాగే ఒక వ్యాపారి హవాలా మార్గంలో డబ్బు తరలించడంపైనా దర్యాప్తు చేస్తున్నారు.డిసెంబర్ 23న స్థానిక వ్యాపారి అంకిత్ జైన్, అహ్మదాబాద్‌కు చెందిన కన్హయ్య లాల్‌కు రూ.14 లక్షలు ఒక పెట్టెలో ఉంచి ప్రైవేట్ బస్సు డ్రైవర్ ద్వారా పంపాడు. ఇండోర్‌లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో దర్యాప్తు పేరుతో బస్సు డ్రైవర్‌ నుంచి ఆ క్యాష్‌ బాక్స్‌ను తీసుకున్నారు. అయితే డబ్బుల స్వాధీనం గురించి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదు. కాగా, తాను పంపిన రూ.14 లక్షలు కన్హయ్య లాల్‌కు అందలేదని వ్యాపారి జైన్‌కు తెలిసింది. దీంతో ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ నరేంద్ర తివారీపై చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుల్స్‌ యోగేష్ చౌహాన్, దీపక్ యాదవ్‌ ఈ డబ్బు కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో దోపిడీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు, వ్యాపారవేత్త అంకిత్ జైన్‌, బస్సు డ్రైవర్‌ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు పంపాడు అన్న దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నట్లు అనుమానించారు. స్వాధీనం చేసుకున్న ఈ డబ్బు గురించి ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తామని అదనపు డీసీపీ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)