రాహుల్ గాంధీ ఎందుకొచ్చిండు, గడ్డి కొయ్యనీకా?

Telugu Lo Computer
0


మ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, కొల్లాపూర్‌లోని ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ  కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే గాకుండా వెనుకబడిన ప్రాంతమని, గరీబు ప్రాంతమని పేర్లు పెట్టారని మండిపడ్డారు. మరె ఈ గరీబు ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలం ఎట్లయ్యిందని, కోట్ల టన్నుల వడ్లు ఎట్ల పండుతున్నయని ప్రశ్నించారు. జరిగే ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రజల చేతిలో ఉన్న ఏకైక వజ్రాయుధం ఓటు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు, గూండాలు గెలవకూడదని స్పష్టం చేశారు. గతంలో పాలమూరు నుంచి అధికంగా వలసలు ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలమూరులో వచ్చిన మార్పును ప్రజలు గుర్తించాలని అన్నారు. పాలమూరులో కరవు రాకుండా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు కేసీఆర్. ఆర్డీఎస్‌ నుంచి నీళ్లు తరలించుకుని వెళ్తున్నా ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల మీద ఆశతో ఏం మాట్లాడలేదని ఆరోపించారు. ఆర్డీఎస్‌ కాలువల్లో పూడికతీత పనులకు రూ.13 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్‌ గతంలో పెండింగ్‌లో పెట్టింది కూడా కాంగ్రెస్​నేనని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులు తప్ప ఏం లేవని కేసీఆర్ విమర్శించారు. తాము కాంగ్రెస్‌ చేసిన అన్యాయాలను సరిదిద్దుకొస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.200 ఉండే పింఛన్‌ను రూ.2వేలకు పెంచామని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబంధు వృథా అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ధ్వజమెత్తారు. 'మొన్న ఇందిరమ్మ వారసుడు రాహుల్‌ గాంధీ వచ్చిండు ఇదే కొల్లాపూర్‌కు. దేని కోసం వచ్చిండు.. గడ్డి కొయ్యనీకా..? మళ్ల తెలంగాణను ఆగం పట్టిచ్చి, ముళ్ల కిరీటం పెట్టనీకా..? దయచేసి మీరు ఆలోచన చెయ్యాలె. ఈ ఓట్లు మన తలరాత రాసే ఓట్లు. ఆషామాషీగా వేస్తే ఆగమాగం అయిపోతం. కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దు' అని ప్రజలను కేసీఆర్ కోరారు. ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. బోయలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్‌ పార్టీనేనని.. మరోసారి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశమివ్వాలన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)