అగమ్యగోచరంగా మారిన టన్నెల్‌ బాధితుల పరిస్థితి !

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌ రాష్ట్రంలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు గత 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ అపరేషన్‌కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటికే రక్షణ బృందాలు బాధితులను బయటికి తెచ్చేందుకు పలు రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాయి. మరో ప్రయత్నంగా సొరంగం పైనుంచి డ్రిల్‌ వేసి బాధితులను బయటికి తీసేందుకు యత్నించారు. కానీ, మధ్యలో గట్టి బండరాయి తగలడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇంకో ప్రయత్నంగా కూలిన శిథిలాల నుంచే సొరంగం లోపలికి డ్రిల్‌ వేసేందుకు యత్నించారు. కానీ, ఇవాళ డ్రిల్‌ మిషన్‌ బ్లేడ్‌లు సొరంగం శిథిలాల్లో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. కాగా, సొరంగానికి డ్రిల్‌ వేయడం సమస్య కాదని, అయితే దాని లోపల ఉన్న బాధితులకు ఎలాంటి హాని జరగకుండా బయటికి తీసుకురావడమే కష్టసాధ్యంగా మారిందని అంతర్జాతీయ టన్నెలింగ్‌ ఎక్స్‌పర్ట్‌ ఆర్నాల్డ్‌ డిక్స్‌ అన్నారు. మ్యాన్యువల్‌గా సొరంగాన్ని తవ్వడమే ఇక ఆఖరి మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు దాదాపు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నదని, క్రిస్మస్‌ పండుగ లోపల బాధితలను వారి ఇండ్లకు చేరుస్తామన్న నమ్మకం ఉన్నదని డిక్స్‌ చెప్పారు. ప్రస్తుతం 6 అంగుళాల పైపు ద్వారా బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. దాని ద్వారానే బాధితులతో కుటుంబసభ్యులను మాట్లాడిస్తున్నారు. కాగా, ఈ నెల 12న కొండచరియలు విరిగిపడటంతో సిల్క్యారా టన్నెల్‌లో కొంత భాగం కూలింది. ఆ టన్నెల్‌లో పనిచేస్తున్న 41 మంది కూలీలు బయటికి వచ్చే మార్గం లేక అందులోనే చిక్కుకుపోయారు. అయితే బయటికి తీసుకొచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని చెబుతుండటంతో బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)