మహిళల గౌరవాన్నిదెబ్బ తీసే మూస పదాలకు స్వస్తి !

Telugu Lo Computer
0


హిళల గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఉండే మూస పదజాలానికి సుప్రీంకోర్టు స్వస్తి పలికింది. ఈ మేరకు వేశ్య, పతిత, విధేయత గల భార్య వంటి దాదాపు 40 పదాలను తొలగిస్తూ కొత్త హ్యాండ్ బుక్‌ను విడుదల చేసింది. మహిళలకు సంబంధించిన తీర్పుల్లో ఇకపై న్యాయమూర్తులు సున్నితమైన పదజాలాన్ని ఉపయోగించనున్నారు. బుధవారం ఉదయం సీజేఐ డీవై చంద్రచుడ్ కొత్త హ్యాండ్ బుక్‌ను రిలీజ్ చేశారు. గత తీర్పుల్లో వాడిన మూసపదాలు మహిళల గౌరవాన్ని తగ్గించేవిగా ఉ‍న్నాయని పేర్కొన్న ఆయన తీర్పుల్లో న్యాయమూర్తులు వాడిన పదాలు సమాజంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు. సరైన తీర్పును చెప్పడానికి న్యాయమూర్తులు సహజంగానే కొన్ని పదాలను వాడాల్సి వస్తుందని చెప్పారు. న్యాయమూర్తులు ఇచ్చిన గత తీర్పుల్ని తప్పుబట్టడం లేదని వెల్లడించారు. 'తీర్పుల్లో విషయాన్ని తెలపడానికి న్యాయమూర్తులు మహిళల పట్ల వాడే కొన్ని పదాలు లింగ వివక్షకు దారితీస్తున్నాయి. ఇది వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కేసుల్లో సరైన తీర్పు వెల్లడించినప్పటికీ మూస పదాల కారణంగా ఓ వర్గానికి తెలియకుండానే అన్యాయం జరుగుతోంది' అని సీజేఐ డీవై చంద్రచుడ్ తెలిపారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో మహిళల పట్ల ఉపయోగిస్తున్న మూసపదాలను తొలగిస్తూ హ్యాండ్‌ బుక్‌ను అప్‌లోడ్ చేశారు. అత్యాచారం, వేధింపులతో సహా మహిళలకు ముడిపడి ఉన్న కేసుల్లో ఇకపై సున్నితమైన పదజాలాన్ని వాడనున్నారు. మూస పదాల స్థానంలో ఆ పదాల మానసిక స్థితిని తీర్పుల్లో పేర్కొనాలని సుప్రీంకోర్టు హ్యాండ్‌ బుక్‌లో పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)