ప్రజలంతా ఏకం కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు !

Telugu Lo Computer
0


బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగిన విపక్షాల భేటీ ఆసక్తిగా మారింది. అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పాట్నా విపక్షాల భేటీపై స్పందించారు. ఆ భేటీకి బీఆర్ఎస్ దూరంగా ఉందన్న ఆయన, కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే అన్నారు. ఏకం కావాల్సింది దేశంలోని పార్టీలు కాదు, ప్రజలంతా ఏకమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కారణంగానే దేశంలో ఇప్పటికీ తాగునీరు, విద్యుత్ సమస్య ఉందన్నారు కేటీఆర్‌. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం అవసరమని చెప్పుకొచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదని.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా దూరంగా ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేఘాలయాలో బీజేపీ, కాంగ్రెస్, ఎన్పీపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. కాగా, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కైయ్యాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశంలో అత్యంత బలహీనమైన ప్రధాని మోదీనేనని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ నుంచే దేశ రాజకీయాలు చేయాలా?.. దానిని బీఆర్ఎస్‌ మార్పు తీసుకురాబోతోందనన్నారు. హైదరాబాద్ కేంద్రంగా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇక్కడ్నుంచే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని అన్నారు. ఇక, కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా పార్లమెంటులో ఓటేస్తామన్నారు కేటీఆర్. ఈ క్రమంలోనే.. ఢిల్లీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కేటీఆర్. 

Post a Comment

0Comments

Post a Comment (0)