ఆందోళనలతో అట్టుడుకుతున్న పాకిస్థాన్‌ !

Telugu Lo Computer
0


అవినీతి కేసు విచారణ నిమిత్తం మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను పారామిలటరీ రేంజర్స్‌ కోర్టు ఆవరణ నుంచి బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. తన భార్య బుషారా బీబీకి చెందిన అల్‌ ఖదీర్‌ అనే ట్రస్ట్‌కు రూ.53 కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా బదలాయింపు చేశారన్న కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్టు ఇస్లామాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పలుచోట్ల పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రజా ఆస్తుల్ని ధ్వంసం చేశారు. పెషావర్‌లోని పాకిస్థాన్‌ రేడియో భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈనేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఇంటర్నెట్‌ సేవల్ని బంద్‌ చేసింది. 144 సెక్షన్‌ విధించింది. ఫైసలాబాద్‌లోని హోంమంత్రి ఇంటిపై పీటీఐ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. రావల్పిండిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై, లాహోర్‌లోని ఆర్మీ కమాండర్‌ ఇంటిపై ఇమ్రాన్‌ అనుచరులు దాడికి దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం గేటును ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల ముందు పాక్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రావల్పిండి, లాహోర్‌, కరాచీ, గుర్జాన్‌వాలా, ఫైసలాబాద్‌, ముల్తాన్‌, పెషావర్‌, మర్దాన్‌లలో పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇమ్రాన్‌ను హింసించామన్న ఆరోపణల్ని పాక్‌ ప్రభుత్వం ఖండించింది. ఇమ్రాన్‌ వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది. గతేడాది ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ఖాన్‌పై 120కిపైగా కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు, ఆర్మీ కొద్ది నెలలుగా ప్రయత్నిస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)