పశ్చిమ బెంగాల్ నిషేధంపై సుప్రీంకోర్టు స్టే !

Telugu Lo Computer
0


'ది కేరళ స్టోరీ' సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనిపై చిత్రనిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బెంగాల్ ప్రభుత్వం నిషేధంపై స్టే విధించింది. మరోవైపు సినిమాను మల్టీప్లెక్సుల్లో బ్యాన్ చేసిన తమిళనాడు ప్రభుత్వానికి, థియేటర్లకు వచ్చే వారికి రక్షణ కల్పించాలని ఆదేశించింది. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఆ సినిమాను ఓ సారి చూడాలనుకుంటున్నట్లు సుప్రీం తెలిపింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. ఈ రోజు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రజల అసహనాన్ని కారణంగా చూపుతూ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించలేదు, లేదంటే అన్ని సినిమాది ఇదే పరిస్తితి అని వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్(సీబీఎఫ్‌సీ) ధ్రువీకరణ పొందిన తర్వాత శాంతిభద్రతలను కాపాడాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వానిదే అని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఒక వేళ సినిమా బాగా లేకపోతే బాక్సాఫీస్ వద్ద దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. కేరళలో 35,000 అమ్మాయిలు అదృశ్యం అయ్యారని, కొందరు ఇస్లాంలో చేరి ఐసిస్ ఉగ్రవాద సంస్థ తరుపున పోరాడేందుకు సిరియా వెళ్లినట్లు చూపించే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 'ది కేరళ స్టోరీ' వివాదాల్లోకి ఎక్కింది. బీజేపీ మినహా కాంగ్రెస్, సీపీఎం, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలు ఈ సినిమాను వ్యతిరేకించాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమా ఆర్ఎస్ఎస్ అబద్దపు ప్రచారంగా అభివర్ణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)