జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సమ్మె విరమణ

Telugu Lo Computer
0


16 రోజులుగా చేస్తున్న సమ్మెను తెలంగాణ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) శనివారం విరమించారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పలు జిల్లాల్లో చాలామంది విధుల్లో చేరారు. దీంతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి విధుల్లో చేరతామన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరని జీపీఎస్‌లను వెంటనే తొలగించాలని, వారి స్థానంలో తాత్కాలికంగా కొత్తవారిని నియమించాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించడంతో జిల్లాల్లో చాలామంది జేపీఎస్‌లు సమ్మె విరమించి, విధులకు హాజరయ్యారు. కొందరు మాత్రం రాష్ట్ర సంఘం నిర్ణయం కోసం ఎదురు చూశారు. చివరికి అన్ని జిల్లాల నేతలు సమ్మె విరమణకే మొగ్గు చూపారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లిని రాత్రి కలిసి తమ సమ్మె విరమణ నిర్ణయాన్ని వెల్లడించారు. తాము యథాతథంగా విధులు నిర్వర్తిస్తామని, తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. దానిని ఆయన స్వాగతించారు. విధుల్లో చేరి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని, వారి సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌, ప్రతినిధులు మాట్లాడుతూ 'సీఎం కేసీఆరే జేపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మా సేవలతోనే పంచాయతీరాజ్‌ శాఖకు 73 అవార్డులు వచ్చారు. సీఎం కేసీఆర్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా సమ్మెను విరమిస్తున్నారు. వారిపై పూర్తి నమ్మకముంది. మా ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తారనే నమ్మకం ఏర్పడింది. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి పంచాయతీరాజ్‌శాఖకు మరింత పేరు తీసుకొస్తాం' అని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)