ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకుని తీరుతాం !

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఖమ్మం జిల్లా కేంద్రంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని  తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో అక్కడ ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం చేయగా దీని పై హిందూ సంఘాలు, యాదవ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. భవిష్యత్తు తరాలు ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడు అనుకునే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి శ్రీ కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తే, కచ్చితంగా అడ్డుకుని తీరుతామని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు షాక్ తగిలినట్లయింది. దీని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే బి ఆర్ ఎస్ మంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్లు గా చర్చ జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ, రాజకీయాల్లో కీలకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఆధిపత్యం చెలాయిస్తారు. ఇంతకాలం కమ్మ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత ఇవ్వని కేసీఆర్, రానున్న ఎన్నికల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి, కమ్మ సామాజిక వర్గం నేతలను ఆకట్టుకోవడానికి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించనున్నట్లు చర్చ జరుగుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)