నవీన్ పట్నాయక్‌తో నితీశ్ కీలక భేటీ

Telugu Lo Computer
0


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈరోజు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమి గురించి చర్చించారు. ఇవాళ నవీన్ పట్నాయక్ తో సమావేశం అనంతరం నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. “మా స్నేహం గురించి మీ అందరికీ తెలుసు. చాలా కాలంగా మేము సహచరులం. ఇవాళ ఏ కూటమి గురించీ చర్చలు జరగలేదు. బీహార్ భవన్ కోసం మేము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూరీలో ఉచితంగా భూమి ఇచ్చాం” అని చెప్పారు. నవీన్ పట్నాయక్ తండ్రి బీజూ పట్నాయక్ తో తమకు సత్సంబంధాలు ఉండేవని నితీశ్ కుమార్ అన్నారు. పట్నాయక్ తో చర్చలు జరపడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశమూ లేదని తెలిపారు. నవీన్ పట్నాయక్ చెప్పినట్లు తమ మధ్య చాలాకాలంగా సత్సంబంధాలు ఉన్నాయని నితీశ్ అన్నారు. కరోనా విజృంభణ సమయం నుంచి తాను నవీన్ పట్నాయక్ ఇంటికి రాలేకపోయానని నితీశ్ కుమార్ చెప్పారు. కాగా, నితీశ్ కుమార్ తదుపరి ముంబైకి వెళ్లి అక్కడి రాజకీయ నాయకులను కలవనున్నారు. కొన్ని రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నితీశ్ కుమార్ కలిశారు. దేశంలోని వీలైనన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తామని నితీశ్ అప్పట్లో అన్నారు. కొన్ని వారాల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ, కాంగ్రెస్ కి సమాన దూరం పాటిస్తామని అన్నారు. అయితే, మమతను నితీశ్ కుమార్ కలిసిన తర్వాత ఆమె అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)