బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరాన్ని తాకిన మోకా తుఫాన్ !

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో అతి తీవ్రమైన తుఫాన్ గా మారిన మోకా ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరాన్ని తాకింది. రెండు దేశాల మధ్య నఫ్ రివర్, టెక్నాఫ్ తీరప్రాంతం మీదుగా సైక్లోన్ గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్ తో తీరం దాటడం ప్రారంభించిందని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ అధికార ప్రతినిధి ఏకేఎం నజమ్ముల్ హుదా వెల్లడించారు. అతి ప్రమాదకరమైన కేటగిరీ 5 తుఫాన్ గా మారిన సైక్లోన్ మోకా తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందని, సైక్లోన్ ప్రభావంతో రెండు దేశాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. తీరప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో ఇప్పటికే 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. కాక్స్ బజార్ లో10 లక్షలకుపైగా రోహింగ్యా శరణార్థులు ఉంటున్న తాత్కాలిక క్యాంపులపైనా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చన్నారు. తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారని, సహాయక చర్యలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. సైక్లోన్ మోకా వల్ల బంగ్లాదేశ్, మయన్మార్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, ల్యాండ్ స్లైడ్ ల ముప్పు ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ వరల్డ్ మెటిరియోలజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించింది. సైక్లోన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లోని పూర్బ మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో హైఅలర్ట్ ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)