మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్ రైలు

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్- ఢిల్లీ మధ్య కొత్తగా మరో వందే భారత్  రైలును ప్రధాని మోడీ శనివారం ప్రారంభించారు. భోపాల్ లోని రాణి కమలాపతి స్టేషన్ నుంచి న్యూఢిల్లీ మధ్య ఈ ట్రైన్ నడవనుంది. దేశంలో ఇప్పటి వరకు 10 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించారు. తాజాగా ప్రారంభించిన ట్రైన్ పదకొండోది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల్లోనే కవర్ చేయనుంది. ఇదిలా ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఈ రోజు కాంగ్రెస్ మిత్రులు మోడీ అందరిని ఏప్రిల్ ఫూల్స్ చేస్తున్నారంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ఈ రైలు ఏప్రిల్ 1వ తేదీనే ప్రారంభం అయింది. ఇది మన నైపుణ్యం, సామర్థ్యం, విశ్వాసానికి చిహ్నం'' అని ప్రధాని అన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయని, ప్రజల సంక్షేమం కోసం వారు సమయం కేటాయించలేదని ప్రధాని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఒకే కుటుంబంపై దృష్టి సారించాయని పరోక్షంగా గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. పేద, మధ్య తరగతివారిని ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇందుకు భారత్ రైల్వేలే ఉదాహరణ అని, చాలా కాలం రైల్వేను ఆధునీకీకరించలేదని అన్నారు. వారి స్వప్రయోజనాల కోసమే రైల్వేలను వాడుకున్నారంటూ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)