ఇది అమృత కాలం కాదు, దోస్తుల కాలం !

Telugu Lo Computer
0


జైపూర్ విమానాశ్రయాన్ని అదానీ సంస్థ ఆపరేట్ చేసే హక్కులను పొందింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కార్యకలాపాల నిర్వహణ అదానీకి బదిలీ చేయడం వల్ల వస్తు సేవల పన్నునుంచి మినహాయింపు ఉందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం, దానిపై ఎలాంటి జీఎస్టీ విధించకపోవడంపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆ వివరాలను తెలియజేస్తూ ఒక పోస్టు పెట్టారు. 'దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌పోర్టులు పొందినా వారికెలాంటి జీఎస్టీ ఉండదు' అని ట్వీట్ చేశారు. 'ఇలా మిత్రులకు ఇవ్వడం ఉచితం కాదట ! ప్రధానికి కృతజ్ఞతలు' అని ఆయన వ్యంగ్యంగా రాశారు. కేంద్రం ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టుగా ఇది అమృత కాలం కాదని, ఎ మిత్ర్‌ కాలమని (దోస్తుల కాలమని) మంత్రి విమర్శించారు. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌ను.. అదానీ కు వ్యాపార బదిలీని సరఫరా 'గోయింగ్ కన్సన్'గా పరిగణిస్తున్నారా.., ఆస్తుల బదిలీపై జీఎస్టీ విధించబడుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ పొందటానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAR రాజస్థాన్ బెంచ్‌ను ఆశ్రయించింది. చట్ట ప్రకారం.. వ్యాపారాన్ని మొత్తంగా లేదా దాని స్వతంత్ర భాగంగా బదిలీ చేయడం GST చట్టం క్రింద ఒక సేవగా పరిగణించబడుతుంది. ఇలాంటి సరఫరాలకు వస్తువులు, సేవల పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం 50 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. అయితే ఈ వివాదంపై 2021లో గుజరాత్ బెంచ్, ఉత్తర్ ప్రదేశ్ బెంచ్ 2022లో ఇచ్చిన తీర్పులను రాజస్థాన్ బెంచ్ ఉటంకించింది. అదానీ వ్యాపారం గోయింగ్ కన్సన్ కిందకు వస్తుందంటూ స్పష్టం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)