ప్రమాద పరిహారానికి పునర్వివాహం అడ్డంకి కాదు !

Telugu Lo Computer
0


రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోతే మహిళ పునర్వివాహాన్ని కారణంగా చూపుతూ ఆమెకు పరిహారం నిరాకరించడం సరికాదని బీమా కంపెనీకి బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. గణేశ్‌ అనే వ్యక్తి 2010 మేలో తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఠాణె-ముంబయి రోడ్డుపై ఆటో ఢీకొట్టడంతో అతను మృతి చెందారు. తర్వాత కొంతకాలానికి ఆమె పునర్వివాహం చేసుకున్నారు. ఈ కారణంతోపాటు ఆటోకు ఠాణె జిల్లాలో మాత్రమే తిరగడానికి అనుమతి ఉండగా అది జిల్లా సరిహద్దులు దాటిందని చెబుతూ ఇఫ్‌కో టోక్యో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం చెల్లించడానికి నిరాకరించింది. అయితే ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని మోటార్‌ ఆక్సిడెంట్స్‌ క్లెయిమ్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.జె.డింగె నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం మార్చి 3న కొట్టేసింది. పూర్తి వివరాలు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. 'భర్త చనిపోయినప్పుడు బాధితురాలి వయసు 19 ఏళ్లు మాత్రమే. పునర్వివాహం చేసుకోవడానికి ఆమె అన్నిరకాలుగా అర్హులు. మీరు పరిహారం వచ్చే వరకు ఆమె పెళ్లి చేసుకోకుండా వేచి ఉండాలా? ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తికి ఆమె భార్య అనే విషయాన్ని మరవొద్దు. పరిహారం పొందేందుకు ఆమె అన్ని విధాలా అర్హురాలే. ఇక ప్రమాదానికి కారణమైన ఆటో జిల్లా సరిహద్దులు దాటితే బీమా చెల్లించడానికి వీలులేదని నిబంధనలను సమర్థిస్తూ కంపెనీ సరైన ఆధారాలు చూపలేదు' అని న్యాయమూర్తి తీర్పులో వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)