పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకే కడప సీనరేజ్‌ టెండరు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 1 March 2023

పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకే కడప సీనరేజ్‌ టెండరు


ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిన్నతరహా ఖనిజాల సీనరేజ్‌ వసూళ్ల టెండరును ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ పొందిన విషయం తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లా సీనరేజ్‌ టెండరును కూడా ఆయన కుటుంబానికి చెందిన సంస్థే దక్కించుకున్నట్లు వెల్లడైంది. ప్రైవేటు సంస్థల ద్వారా సీనరేజ్‌ వసూళ్లకు టెండర్ల ప్రక్రియను ఇటీవల పూర్తి చేయగా ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల బిడ్లు ఖరారయ్యాయి. ఇందులో చిత్తూరులో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ బిడ్‌ దక్కించుకోగా, దాని పేరిట 'పెద్దాయన' అనుచరులు కొద్ది రోజులుగా ఆయా జిల్లాల్లో సీనరేజ్‌ వసూళ్లు ప్రారంభించారు. తాజాగా కడప జిల్లా టెండరును దక్కించుకున్న హిల్‌సైడ్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్‌ (ఎల్‌ఎల్‌పీ) అనే సంస్థ కూడా సీనరేజ్‌ వసూళ్లను మొదలు పెట్టింది. ఇది కూడా పొంగులేటి కుటుంబానికి చెందినదే. ఇందులో ఆయన కుమార్తె, కుమారుడితోపాటు సోదరుడి సంతానమైన సప్నీరెడ్డి పొంగులేటి, హర్షారెడ్డి పొంగులేటి, లోహిత్‌రెడ్డి పొంగులేటి, పొంగులేటి లిఖిత్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ 2021 మార్చి 26న రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో నమోదు చేసుకుంది. అయితే చిత్తూరు జిల్లాలో మాదిరిగా 'పెద్దాయన' అనుచరులు కాకుండా, కడప జిల్లాలోని హిల్‌సైడ్‌ సంస్థకు చెందిన ప్రతినిధులే సీనరేజ్‌ వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో సీనరేజ్‌ వసూళ్లకు బిడ్‌ పొందిన అమిగోస్‌ మినరల్స్‌ సంస్థ ఈ టెండరు పిలిచిన సమయంలోనే పుట్టింది. గనులశాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 17న రెండోసారి సీనరేజ్‌ వసూళ్ల టెండర్లు పిలిచారు. అదేనెల 28న అమిగోస్‌ మినరల్స్‌... రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో నమోదు చేసుకున్నట్లు ఉంది. అంటే గనుల శాఖ టెండర్లు పిలిచాక పుట్టిన సంస్థ.. ఒక్కటే బిడ్‌ దాఖలు చేసి, టెండరునూ సొంతం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటనేది లీజుదారుల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సంస్థ తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.10.79 కోట్లు చెల్లించి, బ్యాంకు గ్యారంటీగా రూ.21.59 కోట్లు చూపించి కార్యకలాపాలు మొదలుపెట్టేలా అధికారులు ఆదేశాలిచ్చారు. ఈ వారంలోనే అమిగోస్‌ మినరల్స్‌ ఆధ్వర్యంలో పర్మిట్ల జారీ మొదలవుతుందని తెలిసింది. ఇప్పటికే ఆ జిల్లాల్లో లీజుదారులు అందరితో గనులశాఖ అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఆయా జిల్లాలలో గనుల శాఖ ద్వారా జారీ చేసే ఆన్‌లైన్‌ పర్మిట్లను నాలుగైదు రోజులుగా నిలిపేశారు. ప్రైవేటు సంస్థలు సీనరేజ్‌ వసూళ్ల టెండర్లు పొందిన జిల్లాల్లోని లీజుదారులకు అధికారులు షాకిచ్చారు. ఆయా లీజుదారులు సొమ్ము చెల్లించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో పొందిన పర్మిట్లను... తాజాగా లాక్‌ చేసి, వాటిని వినియోగించేందుకు వీల్లేదని తెలిపారు. సాధారణంగా వివిధ ఖనిజాలకు గనుల శాఖ నుంచి ఆన్‌లైన్‌ పర్మిట్లు పొందినోళ్లు 60 రోజుల్లో వాటిని వినియోగించుకొని సంబంధిత ఖనిజాన్ని తరలించేందుకు వీలుంటుంది. ఇటువంటి పర్మిట్లు వినియోగించే అవకాశం లేకుండా... లీజుదారుల ఐడీలను లాక్‌ చేశారు. దీంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. ఖనిజాన్ని తరలించాలంటే మళ్లీ సీనరేజ్‌ చెల్లించాల్సిందేనని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. మరి తమ వద్ద ఉన్న పర్మిట్ల పరిస్థితి ఏమిటని లీజుదారులు గనులశాఖ అధికారుల వద్ద ప్రస్తావిస్తే.. వాటి సంగతి తర్వాత చూద్దామని బదులిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఇంటి నుంచో, లీజు ప్రాంతం నుంచో ఆన్‌లైన్‌ పర్మిట్లు తీసుకునే వాళ్లమని, ఇప్పుడు కొత్త విధానంలో పర్మిట్లు కావాలంటే గుత్తేదారు కార్యాలయానికి వెళ్లి నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని లీజుదారులు వాపోతున్నారు. ఆన్‌లైన్‌ విధానం తీసేసి, గుత్తేదారులు చేతితో రాసిన పర్మిట్లు ఇచ్చే విధానం ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదని, వీళ్లు కూడా ఆన్‌లైన్‌లో పర్మిట్లు ఇస్తేనే ఇందులో పారదర్శకత ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

No comments:

Post a Comment