భార్య మరణాన్ని జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య

Telugu Lo Computer
0


హైదరాబాద్​లో ఓ రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందింది. ఆ విషయం జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ బోరబండ కార్మికనగర్‌లో నివాసముంటున్న సాయన్న, భాగ్యలక్ష్మిల చిన్న కుమారుడు భరత్‌. బీహెచ్‌ఈఎల్ ఆర్టీసి డిపోలో 10ఏళ్లుగా మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మమత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 28 రోజుల క్రితం భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆమెను విడిచి ఉండలేని భరత్‌ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. నెల వ్యవధిలో ఇద్దరిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత నెలలో భరత్‌కుమార్‌కు అనారోగ్యంగా ఉండటంతో సెలవు పెట్టేందుకు తాను పనిచేస్తున్న ఆర్టీసీ డిపోకి బయల్దేరాడు. భార్య మమత కూడా వస్తానని చెప్పడంతో కుమార్తెను కూడా తీసుకుని బయల్దేరారు. నెల రోజులు సిక్‌ లీవ్‌ అప్లై చేసి తిరిగి వస్తుండగా మూసాపేట వంతెనపై వేగంగా వచ్చిన డీసీఎం వాహనం వీరిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. మమత అక్కడికక్కడే మృతి చెందింది. భరత్‌, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య మృతిని తట్టుకోలేకపోయిన భరత్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మమతా నువ్వు లేకుండా నేను ఉండలేక పోతున్నాను. పిల్లల్ని అక్క అన్నయ్య బాగా చూసుకుంటారు అంటూ సూసైడ్‌ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం అందమైన కుటుంబాన్ని చిదిమేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)