అప్పుల్లో ఆంధ్రులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 16 March 2023

అప్పుల్లో ఆంధ్రులు !


ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలూ అప్పుల్లో కూరుకుపోయారు. 18 సంవత్సరాలు నిండిన వారిలో ప్రతి లక్ష మందిలో 46 వేల 330 మంది సొంతంగానో, వ్యక్తుల ద్వారానో అప్పు తీసుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా సర్వేలో వెల్లడైంది. 2020 జనవరి - డిసెంబర్‌ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించాలని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా 2021 ఆగస్టు 15వరకు డేటా సేకరణ కొనసాగించారు. దేశ వ్యాప్తంగా 8వేల 469 గ్రామీణ, 5వేల 797 పట్టణ ప్రాంతాల్లోని 2 లక్షల 76వేల 409 ఇళ్ల నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ తాజా నివేదికలో వెల్లడైన అంశాల ప్రకారం మరే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత భారీ సంఖ్యలో ప్రజలు అప్పుల్లో లేరు. ఈ సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో నిలవగా, ప్రతి లక్ష మందిలో 39వేల 358 మంది ఏదో ఒక రూపంలో అప్పు చేశారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్​లో 17శాతం మంది ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయారు. జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఏపీలో 193 శాతం మంది, తెలంగాణలో 148 శాతం మంది అధికంగా అప్పుల్లో ఉన్నారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల తర్వాత తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణులపైనే అధిక రుణ భారం ఉంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అప్పులపాలయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి లక్ష మంది మహిళల్లో 51.49శాతం, పురుషుల్లో 46.61 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. పట్టణాల్లో మహిళలు 35.38 శాతం, పురుషులు 45.16 శాతం మంది రుణభారం మోస్తున్నారు. తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ మహిళలతో పోలిస్తే గ్రామీణ, పట్టణ ప్రాంత పురుషుల పైనే అధిక అప్పు ఉంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలోని మహిళలపై రుణభారం చాలా తక్కువ కనిపించింది. ఇక్కడి గ్రామీణ మహిళల్లో 39.84 శాతం మంది, పట్టణ మహిళల్లో 15శాతం మాత్రమే అప్పుల భారం మోస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ మహిళలు అతి తక్కువ సంఖ్యలో అప్పు తీసుకున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికి 17వందల 91 మంది, పట్టణాల్లో 11వందల 86 మంది సొంతంగానో, తెలిసిన వాళ్ల దగ్గరో అప్పు చేశారు. ఈ సర్వే చేసే నాటికి కనీసం 5 వందల రూపాయలకు మించి అప్పు చేసి, తీర్చలేని బాకీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. సహకార సంస్థలు, ప్రభుత్వం, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రావిడెంట్‌ ఫండ్‌ అథారిటీ, ఇన్సూరెన్సు కంపెనీల నుంచి నుంచి తీసుకున్న రుణాలను సంస్థాగత రుణాలుగా పరిగణించారు. బంధువులు, వడ్డీ వ్యాపారులు, స్నేహితుల నుంచి తీసుకున్న అప్పులను అసంఘటిత రంగాల నుంచి తీసుకున్న వాటిగా పరిగణించారు.

No comments:

Post a Comment