ప్రధానితో ఈజిప్టు అధ్యక్షుడు భేటీ

Telugu Lo Computer
0


గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం దిల్లీకి చేరుకున్న ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేలా వ్యవసాయం, డిజిటల్‌ డొమైన్‌, వాణిజ్యంతో సహా వివిధ రంగాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. 'ఆసియా, ఆఫ్రికా మధ్య వారధిగా ఉండే ఈజిప్టుతో తమ సంబంధాలు మరింత పెరుగుతున్నాయి. ప్రాచీన, సాంస్కృతిక, ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు జరిపిన విస్తృత చర్చలు ఎంతో దోహదం చేస్తాయి' అని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. మూడో భారత్‌-ఆఫ్రికా ఫోరమ్‌ సదస్సులో భాగంగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌-సిసి 2015 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. అనంతరం 2016 సెప్టెంబర్‌లోనూ అధికారిక పర్యటనకు వచ్చారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఓ ఈజిప్టు అధ్యక్షుడు ఆహ్వానం పొందడం మాత్రం ఇదే తొలిసారి. ఈ వేడుకల్లో 120 మందితో కూడిన ఈజిప్టు సైనిక బృందం సైతం పాల్గొననుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)