భారత్ జోడో యాత్రకు బ్రేక్ !

Telugu Lo Computer
0


పంజాబ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నది. రెండో రోజు లూథియానాలోని సమ్రాలా చౌక్ వద్ద యాత్రను రాహుల్ గాంధీ ముగించారు. లోహ్రీ పండుగ కారణంగా యాత్రకు బ్రేక్‌ పడింది. విశ్రాంతి దొరకడంతో రాహుల్‌ విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. తిరిగి శనివారం లూథియానా నుంచి జలంధర్‌కు యాత్ర బయల్దేరుతుంది. రాహుల్‌ వెంట పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వాడింగ్, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఎంపీ రవ్‌నీత్ బిట్టుతో పాటు ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా నడిచారు. యాత్ర జరుగుతున్న లూథియానాలో 1984 అల్లర్ల బాధితులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఢిల్లీ బయల్దేరడానికి ముందు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. పంజాబ్ అంటే సాయం చేసేవారి రాష్ట్రమని పొగిడారు. ఇక్కడి గురువులు అందరికీ ప్రేమించడం నేర్పారన్నారు. డీమోనిటైజేషన్, తప్పుడు జీఎస్టీ కారణంగా లూథియానాను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు. చిన్న తరహా పరిశ్రమల అభ్యున్నతిపై కాకుండా కేంద్రం కేవలం రెండు, మూడు కుటుంబాలపైనే దృష్టి పెట్టిందని దుయ్యబట్టారు. చిన్న తరహా పరిశ్రమల ద్వారానే ఉపాధి దొరుకుతుందని చెప్పిన రాహుల్‌.. చిన్న పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు కేంద్రం ఏంచేసిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. చిన్న తరహా పరిశ్రమలకు సరైన ప్రోత్సహం అందితే మనం చైనాతో పోటీపడగలమన్నారు. లూథియానాను మాంచెస్టర్‌గా పిలిచామని, అయితే మాంచెస్టర్‌కు భవిష్యత్‌ లేదని, మన లూథియానాకే భవిష్యత్‌ ఉన్నదని రాహుల్‌ చెప్పారు. కేంద్రం దేశంలో భయం, ద్వేషం, అహింసను వ్యాప్తి చేస్తోందని, ఒక మతంతో మరో మతం, ఒక స్నేహితుడితో మరో స్నేహితుడు, ఒక సోదరుడితో మరో సోదరుడు పోట్లాడుకోవడాన్ని ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు. శనివారం లాడోవాల్‌ టోల్ ప్లాజా నుంచి తన యాత్ర కొనసాగుతుందని, 8 రోజుల పాటు యాత్ర జరుగుతుందని రాహుల్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)